ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో పడిగాపులుగాస్తున్నారు. గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరుకుతుందనే గ్యారెంటీ లేకపోవడంతో అలిసిపోయిన రైతులు వెనుదిరుగుతున్నారు. పర్మిట్లు పొందడానికి కూడా నానా అగచాట్లు పడుతున్నారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసుల పహారాలో యూరియా అందజేయాల్సి వస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత ఏర్పడిందని, అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్ : షాబాద్‌లోని సహకార సంఘం కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. వారికి ఒకరోజు ముందు యూరియా పర్మిట్లు అందించడంతో ఉదయం నుంచే పడిగాపులు కాశారు. ఒక లారీ మాత్రమే యూరియా రావడంతో సగం మందికే పంపిణీ చేశారు. రెండు రోజుల తర్వాత వచ్చే యూరియా కోసం రైతువేదిక వద్ద యూరియా పర్మిట్ల కోసం అన్నదాతలు బారులు తీరారు. రైతులు ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. అనంతరం పోలీసుల పహారాలో ఏవో కృష్ణమోహన్ యూరియా పర్మిట్లు పంపిణీ చేశారు.
ఒక్కో రైతుకు ఒక్కటే బస్తా
యాచారం : యాచారం సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. సుమారు 1000 మందికి పైగా చేరుకున్నారు. 700 మంది రైతులకు అధికారులు టోకెన్లను అందజేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొన్నది. అన్నదాతలు కొద్ది సేపు సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న సీఐ నందీశ్వర్‌రెడ్డి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
క్యూలో రావాలని రైతులను పోలీసులు తోసేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బస్తా యూరియా కోసం వారం రోజులుగా పనులు మానుకొని సొసైటీ చుట్టూ తిరుగుతున్నామని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రైతులను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. మండలానికి 450 బస్తాల యూరియా రావడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున సరఫరా చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది పడలేదని అన్నదాతలు పేర్కొన్నారు. అందరికీ సరిపడా యూరియాను సకాలంలో అందజేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా గురించి ఆందోళన చెందవద్దని టోకెన్లు ఇచ్చిన 250 మంది రైతులకు రెండు మూడు రోజుల్లో సరఫరా చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవినాథ్ తెలిపారు. కొంత మంది రైతులు ఏకంగా కాంగ్రెస్ నాయకులను బూతులు తిట్టడం గమనార్హం. వెంటనే యూరియాను తెప్పించకపోతే సాగర్ రహదారిపై రాస్తారోకో చేయనున్నట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం వరకు నిరీక్షణ
కొత్తూరు : యూరియా వస్తుందని తెలియడంతో తెల్లవారుజామునే మండల పరిధిలోని సిద్దాపూర్ ఆగ్రోస్ సెంటర్ వద్ద రైతులు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు నిరీక్షించి వెనుదిరిగారు. ప్రతిరోజూ యూరియా వస్తుందని చెబుతున్నారు. అవసరమైన సమయంలో యూరియా దొరకకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసుల పహారాలో..
కొందుర్గు : కొందుర్గు పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందజేస్తున్న యూరియాను పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాను అందజేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పీఏసీఎస్‌కు 450 బస్తాల యూరియా వచ్చిందని తెలియడంతో మండలంలోని ఆయా గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇచ్చినవారికే మళ్లీ ఇస్తున్నారు
పెద్దేముల్ : పెద్దేముల్‌లోని రైతు సేవా సహకార సంఘం ఎదుట యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. లోపలికి వెళ్లి తక్షణమే యూరియా బస్తాలను సరఫరా చేయాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. యూరియా తీసుకున్న రైతులకే మళ్లీ ఇస్తున్నారని, యూరియా అందనివారికి ఒక బస్తా కూడా ఇవ్వడంలేదంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి రైతులకు కావాల్సిన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యవసాయాధికారరి పవన్ ప్రీతమ్, ఎస్ఐ వేణుకుమార్, రైతు సేవా సహకార సంఘం మేనేజర్ మురళి రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో రైతుల ఆందోళన సద్దుమణిగింది.
కాంగ్రెస్‌ది సంక్షేమ వైఫల్య ప్రభుత్వం
కొడంగల్ : కాంగ్రెస్ నాయకులు తమది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, కానీ నిజానికి ప్రజా సంక్షేమ వైఫల్య కాంగ్రెస్ ప్రభుత్వంగా పేర్కొనడం సరైందని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు పేర్కొన్నారు. బుధవారం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యూరియా కోసం రైతుల పక్షాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యకుగాను మజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశాల ప్రకారం దౌల్తాబాద్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం వల్ల రైతులు యూరియా అందక అందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ రైతును నిండా ముంచుతున్నట్లు ఆరోపించారు. ప్రస్తుత కాలంలో పంట సాగుకు ప్రధానంగా యూరియా కావాల్సి ఉండగా.. సర్కారు వైఫల్యం కారణంగా కొరత ఏర్పడం బాధాకరంగా ఉందన్నారు. గత కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగిందని కాబట్టే దేశానికే తెలంగాణ రాష్ట్ర అన్నపూర్ణగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఏనాడూ రోడ్డెక్కిన సంఘటనలు తలెత్తలేదని కానీ ప్రస్తుతం రైతులు యూరియా కొరతతో రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నదన్నారు.