ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 11 : పందిరిపై కూరగాయల సాగుతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. తీగజాతి కూరగాయలు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను తగ్గించేందుకు దోహదపడుతున్నాయి. దీంతో కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తీగజాతి కూరగాయలైన సోర, బీర, కాకర, దోస, పొట్ల, దొండ పంటలను రంగారెడ్డి జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు.
సోరకాయ, దోసకాయ, కాకరకాయ విత్తనాలను జనవరి రెండో మాసం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి. బీర విత్తనాలు డిసెంబర్ రెండో వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. పొట్లకాయ డిసెంబర్ నుంచి జనవరి వరకు విత్తుకోవచ్చు. దొండ జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఎకరానికి సోర 0.6 నుంచి 0.8కిలోలు, బీర 0.6నుంచి 0.8కిలోలు, కాకర 0.8నుంచి ఒక కిలో వరకు, పొట్ల 0.6నుంచి 0.8కిలోలు, దోస కిలో నుంచి 1.4కిలోలు, దొండ చూపుడు వేలు మందం కలిగి నాలుగు కణుపులు గల కాండం ముక్కలు 1333 నుంచి 2వేల వరకు అవసరమవుతాయని చెబుతున్నారు.
బీర, కాకర, దోస విత్తనాలను వేసవిలో రెండు వరుసలలో మొక్క మొక్కకు మధ్య దూరం పొడవు 2మీటర్లు, ఒక వరుసలో మొక్క, మొక్కకు మధ్య వెడల్పు 0.5 మీటరు ఉండాలి. సోర 2.5 మీటర్ల పొడవు అర మీటరు వెడల్పు ఉండాలి. దొండ, పొట్ల సాగులో పొడవులో 2 మీటర్లు, వెడల్పులో 1-2 మీటర్ల దూరం కలిగి ఉండాలి.
ఎకరానికి 6-8 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువు, 4కిలోల పాస్పోబ్యాక్టీరియా, 4కిలోల ఆజోస్పైరిల్లమ్ను ఆఖరి దుక్కిలో వేయాలి.
రసాయన ఎరువులు : 32-40కిలోల భాస్వరం, 16-20కిలోల పొటాష్, 32-40కిలోల నత్రజనిని ఎకరానికి వేయాలి. భాస్వరం, పొటాష్‌ను పాదులలో వేయాలి. నత్రజనిని రెండు సమభాగాలుగా చేసుకుని విత్తిన 25-30 రోజులకోసారి, పూత, పిందె సమయంలో మరోసారి వేయాలి. వేసవిలో ఆడపూలు ఎక్కువగా వచ్చేందుకు 2-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2గ్రాముల బోరాక్స్‌ను కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
గుమ్మడి పెండు పురుగు : ఇవి మొక్క మొలిచిన వెంటనే ఆశించి నష్టపరుస్తారు. నివారణకు 2శాతం పాలిడాల్ పొడిని వారంలో రెండుసార్లు చల్లాలి. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ప్రాఫినోఫాస్ 2 మి.లీ. లేదా మలాథియాన్ 2 మి.లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పొట్లాకు పురుగు : ఇవి మొక్కల పెరుగుదల, పూత దశల్లో ఆకులను ఎక్కువగా కొరికివేస్తాయి. నివారణకు క్లోరోఫైరిపాస్ 2 మి.లీ లేదా ఒక గ్రాము థయోడీకార్ప్ను లీటర్ నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి.
పండు ఈగ : పండు ఈగసోకి పంటలో కోతకు వచ్చే కాయలను ధ్వంసం చేయడంతో పాటు కాయ లోపలి భాగం కుల్లి నాణ్యత తగ్గుతుంది. దీనికి ఒక మి.లీ మలాథియాన్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నివారణకు 10లీటర్ల నీటికి 100 మి.లీ మలాథియాన్, 100 గ్రాముల బెల్లం, 250మి.లీ బాగా పులిసిన కల్లును మట్టి మూకుళ్లల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి.
బూజు తెగులు : నివారణకు లీటర్ నీటికి మాంకోజబ్ 2.5గ్రాముల లేదా తీవ్ర దశలో ఉంటే రెడోమిల్ ఎం.జడ్ ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు : నివారణకు లీటర్ నీటికి ఒక మి.లీ కెరాథేన్ లేదా ఒక గ్రాము డైనోకాప్ కలిపి పిచికారీ చేయాలి. గుమ్మడి పెంకు పురుగుల కారణంగా చెట్టు ఎదుగుదల మందగిస్తుంది దీనికి క్లోరోఫైరిసాస్ 2మిల్లీ, వేపనూనే 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు సోకడం వల్ల ఆకుల్లోని పత్రహరితం దెబ్బతిని ఆకుముడతలు ఏర్పడుతాయి. వీటి నివారణకు 1.5 గ్రాముల ఎస్పేట్, పిప్రోనిల్ రెండు మి.లీ ఇమిడాకోప్రిడ్ ఒక మి.లీ నీటికి వినియోగించాలి.
పాముపొడ పురుగు : ఈ పురుగు కారణంగా చెట్టు బలహీన పడుతుంది. వీటికి గ్రాము అబామెక్టిన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకడం వల్ల కాయ, ఆకులు, పసుపుపచ్చ రంగులోకి మారి పూర్తిగా దెబ్బతింటాయి. దీని నివారణకు గుమ్మడి పెంకు పురుగుల కారణంగా చెట్టు ఎదుగుదల మందగిస్తుంది దీనికి క్లోరోఫైరిసాస్ 2మిల్లీ, వేప నూనే 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. రసంపీల్చే పురుగులు సోకడం వల్ల ఆకుల్లోని పత్రహరితం దెబ్బతిని ఆకుముడతలు ఏర్పడుతాయి. వీటి నివారణకు 1.5 గ్రాముల ఎస్పేట్, పిప్రోనిల్ రెండు మి.లీ ఇమిడాకోప్రిడ్ ఒక మి.లీ నీటికి వినియోగించాలి.
ఆకుపచ్చ తెగులు : నివారణకు లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు దీనిని ఎండు తెగులు అనికూడా అంటారు. దీని ప్రభావం వల్ల తీగలు వాడిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి.
నివారణకు బోర్డో మిశ్రమం 1 శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను 3 గ్రాములు లీటర్ నీటిని కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడిచేటట్లు పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పోయాలి. ముందు జాగ్రత్తగా ఆకరు దుక్కిలో ఎకరాకు 250 కిలోల వేపపిండిని వేసి బాగా కలియ దున్నాలి. పంట వేసిన తర్వాత ట్రైకోడెర్మా విరిడే కల్ఫర్ను పశువుల ఎరువులో కలిపి మొక్కల పాదుల దగ్గర వేయాలి.
తీగజాతి కూరగాయల సాగు చాలా తేలిక. ఖర్చు కూడా తక్కువే. ఇవి ఎగబాకడానికి వెదురు కర్రలతో పందిర్లు వేసి వాటిపైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. పందిరి వేస్తే కాసిన కాయలు కిందకు వేలాడుతాయి. ఇలా వేలాడిన వాటిని తెంపడానికి సులభం. ఇలా పండించిన కూరగాయలతో అధిక లాభాలను పొందుతారు. తీగజాతి కూరగాయల పంటలకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు సరైన సమయమైనందున రైతులు దృష్టి సారించాలి.
– సత్యనారాయణ, వ్యవసాయశాఖ ఏడీఏ