కొడంగల్, అక్టోబర్ 26 : తమ భూములను కాపాడుకునేందుకు గత ఎనిమిది నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని ఫార్మా విలేజ్ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, ఇలా ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి మనస్సు మాత్రం కరగడంలేదని వాపోతున్నారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి కావడంతో చాలా సంతోషించామని.. మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని.. పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందుతుందని ఆశిస్తే.. ఆయన మా భూముల్లోనే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, ప్రాణాలు పోతాయని చెబుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
సీఎంకు ఒక్కసారి కూడా రైతుల సమ స్యలను తెలుసుకునేందుకు సమయమే దొరకడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాం గ్రెస్ పార్టీ నాయకులు రైతులకు ఫోన్లు చేసి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, ఇవ్వకుంటే మీ భూములను లాక్కోవడం ఖాయమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ పచ్చటి పొలాలను ఇచ్చి ఎక్కడికెళ్లాలి.. ఏమి తిని బతకాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలు, ప్రైవేట్ ఉద్యోగం మమ్మల్ని ఎన్ని రోజులు కాపాడుతుంది.. మా పిల్లలకు భూములు ఉండొద్దా..? వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవించాలా..? అని ప్రశ్నిస్తున్నారు.
రోటిబండతండాలో జరిగిన పోలీసుల లాఠీచార్జిలో పలువురు రైతులు సొమ్మసిల్లి పడిపోయారని.. తమ భూములను కాపాడుకునేందుకు ఓ యువకుడు పెట్రోల్‌తో ఆత్మబలిదానం చేసేందుకు సిద్ధమైనా సీఎం రేవంత్‌రెడ్డి మనసు చలించడం లేదా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకులే ముఖ్యమా.. రైతులు అవసరం లేదా..?.. అని మండిపడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం.. మా పంట పొలాలను ఫార్మా విలేజ్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని.. దానిని రద్దు చేసేవరకూ ప్రభుత్వంతో ఎంతవరకైనా పోరాడుతామ ని, అవసరమైతే ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధమని వారు తేల్చి చెబుతున్నారు. రోటిబండ తండాలో జరిగిన సంఘటనలో తమ ఆవేశాన్ని చూస్తున్నారే గాని, దాని వెనకున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నాయకులు చాలా అత్యుత్సాహాన్ని చూపుతున్నారు. రైతులు భూములు ఇవ్వాలని.. లేకుంటే బలవంతంగా లాక్కుం టామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పంట పొలాలను కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలకు ఇచ్చి మేము ఎలా బతకాలి..?. రేవంత్‌రెడ్డి మేము వేసిన ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచి, సీఎం అయ్యారు. ఆయన ఈ ప్రాంత వాసి అయి ఉండి కూడా మమ్మల్ని బాధపెట్టడం తగదు.
-సోమ్లానాయక్, ఫార్మా భూ బాధిత రైతు,పులిచెర్లకుంట తండా, దుద్యాల
సీఎం రేవంత్‌రెడ్డికి తన సెగ్మెంట్లోని రైతులు అవసరం లేనట్లుగా ఉన్నది. గత 8 నెలలుగా ఫార్మా కంపెనీల ఏర్పాటు వద్దే.. వద్దు అంటూ ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలతో నిరసన తెలుపుతున్నా.. మా గురించి ఒక్క మాట కూడా మా ట్లాడడం లేదు. అధికారులను పంపించి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రోటిబండ తండాలో జరిగిన లాఠీచార్జిలో పలువురు రైతులు సొమ్మసిల్లిపడిపోయారు. వారిని పరామర్శించేందుకు సీఎంకు సమయమేలేదా..? రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకులే ముఖ్యమా.. రైతులు అవసరం లేదా..?
-గోపాల్‌నాయక్, ఫార్మా భూబాధిత రైతు, పులిచెర్లకుంట తండా, దుద్యాల
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని గెలిపించేందుకు మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంత వలస కూలీలైన గిరిజనుల ఓట్లను వేయించా. ఆయన విజయం కోసం నిద్రాహారాలు మాని కష్టపడ్డా. కానీ, ఆయన సీఎం అయిన తర్వాత మా బతుకులనే రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు. గతంలో పంటలు పండకుంటే ముంబయి, పుణె, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లేది. ఇప్పుడిప్పుడే పంటలు పండించుకొని కుటుంబ సభ్యులతో జీవిస్తున్నా. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మా భూములు పోతే మళ్లీ తండాను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి వస్తుంది.
-విఠల్‌నాయక్, ఫార్మా భూబాధిత రైతు, పులిచెర్లకుంట తండా, దుద్యాల