యాచారం, మార్చి28: రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు బోర్లలో ఇప్పటికే ఇటివల కాలంలోనే మూడు బోర్లు పూర్తిగా వట్టి పోయినవి. ఒక బోరు మాత్రం ఆపుతూ అంతంత మాత్రంగానే పోస్తున్నది. తనకున్న 12 ఎకరాల పొలానికిగాను పంటకు నీరందుతుందో లేదోననే సందేహంతో 6 ఎకరాల పొలంలో యాసంగిలో వరిపంటను సాగు చేశాడు. మొదట్లో పంట బాగానే ఉన్నప్పటికి మండలంలో నెలకొన్న కరువులో భాగంగా ఇటివలే అతని బోర్లు అడుగంటి పోయాయి. ఉన్న ఒక్క బోరుతో పంట తడారకపోవడంతో మండుతున్న ఎండలకు క్రమంగా ఎండి పోవడం మొదలైంది. దీంతో రైతు చేసేదేమిలేక కళ్లముందు ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు సాహాసం చేశాడు. ఒక్కో ట్యాంకరు నీటికి రూ.1000 ఖర్చు చేసి నీటి ట్యాంకర్ ద్వారా పంట చేనుకు నీరందించడం మొదలు పెట్టాడు. చేతి కొచ్చిన పంటను పొట్ట దశలో ఎండి పోకుండా రోజుకు నాలుగైదు వేలు ఖర్చు చేసి పంటకు నీరందిస్తున్నాడు.
అయినప్పటికి ఒకవైపు నీరు పెడుతుంటే మరో వైపు పంట ఎండు ముఖం పడుతున్నది. దీంతో చేసేదేమిలేక వెంటక్రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. పంట పూర్తిగా ఎండిపోతే పశువుల పాలు కాక తప్పదని వాపోతున్నాడు. వేలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదేళ్ల కాలంలో ఎన్నడు ఇంతటి కరువును చూడలేదని ఈ సారి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నాడు. గత పదేళ్లు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడాయని ప్రస్తుతం ఎండిపోవడంతో భూగర్భ జలాలలు అడుగంటి రైతులకు సాగునీటి కష్టాలు వచ్చినట్లు పేర్కొన్నారు.
పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోతున్నట్లు ఆయన తెలిపారు. మండలంలో పంటలెండి పోతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం కన్నెత్తి చూడటంలేదని వాపోతున్నాడు. పంటలెండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు మండలంలో కోకొల్లలుగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుందోనని ఊహించుకుంటేనే భయంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోడెక్కి ఆందోళనలు చేయనున్నట్లు రైతులు హెచ్చరిస్తున్నారు.