రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం మరోమారు సర్వే ప్రారంభించింది. ఫ్యామిలీ ట్యాగ్ పేరుతో బాధిత గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కొత్తగా సర్వేను షురూ చేశారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఎకరానికి గుంట చొప్పున భూమిని ఒకే చోట ఇవ్వాలా….లేక రైతులు కోరుకున్న చోట ఇవ్వాలా..? అన్న విషయంపై సర్వే చేస్తున్నారు.
ఈ సర్వే ను మరింత కాలయాపన చేసేందుకేనని రైతులు భావిస్తున్నారు. రైతులు గత ప్రభుత్వానికే భూములిచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ భూముల్లో సర్వే చేసి కంచెను కూడా ఏర్పాటు చేసింది. ఫెన్సింగ్ లోపల వర్షాకాలంలో పంటలు వేయొద్దని ఇప్పటికే రైతులకు అధికారులు సూచించారు. అయి తే, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూములిచ్చిన రైతులకు ఎకరానికి 120 గజాల చొప్పున ఇంటిస్థలం ఇవ్వాల్సి ఉన్నది.
ఈ ఇండ్ల స్థలాల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం మీర్ఖాన్పేట వద్ద భూమిని కేటాయించి ప్లాట్లుగా మార్చింది. ఆ ప్లాట్లకు సర్టిఫికెట్లను కూడా అందజేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికలొచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ప్లాట్లను రైతుల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సి ఉండగా.. గత 18 నెలలుగా పట్టించుకోవడమే లేదు. గత సంక్రాంతి నాటికే రైతులందరికీ రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించినా ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదు.
కొత్తగా ఫ్యామిలీ ట్యాగ్ సర్వే..
ఫార్మాసిటీ ఏర్పాటుకోసం ప్రభుత్వానికి యాచారం మండలంలో 979 మంది, కందుకూరు మండలంలో 668 మంది రైతులు భూములిచ్చారు. కందుకూరు మండలంలో 1,300 మందికి, యాచారం మండలంలో 3,745 రైతులకు ఇండ్లస్థలాల పట్టాలు ఇవ్వాల్సి ఉన్నది. ఇండ్ల స్థలాలను కేటాయించే విషయంలో కొత్తగా ఫ్యామిలీ ట్యాగ్ సర్వే అని గ్రామాల్లో మరో సర్వేకు ప్రభుత్వం తెరలేపింది. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతు కుటుంబాల్లో భూములు ఎక్కువగా పోయినందున ఒక్కొక్కరికీ నాలుగు నుంచి ఐదు ప్లాట్ల వరకు వస్తాయి. ఈ ప్లాట్లన్నీ ఒకేచోట ఇవ్వాలా..? వేర్వేరుగా ఇవ్వాలా ..? అనే దానిపై అధికారులు ఫ్యామిలీట్యాగ్ సర్వేను చేపడుతున్నారు. అధికారులు గ్రామాలకొచ్చి సర్వేగురించి వివరించి సంతకాలు చేయాలని అడుగుతున్నారు. కానీ, రైతులు మాత్రం సంతకాలు చేయడంలేదు. సంతకాలు చేయించుకున్న తర్వాత ప్లాట్లు ఇస్తారో..? లేదో ..? అన్న అనుమానం వారిలో మొదలైంది. ఈ సర్వే ప్లాట్ల కేటాయింపును మరింత జాప్యం చేసేందుకేనని వారు చర్చించుకుంటున్నారు.
ఇంటి స్థలాలు ఇప్పట్లో వచ్చేనా..?
భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించేందుకు గత ప్రభుత్వం అత్యాధునిక వసతులతో వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్టిఫికెట్లను కూడా కేటాయించినా ఇప్పటివరకు ఇంటిస్థలాలను మాత్రం చూపలేదు. మరోవైపు బాధిత రైతులు ఎక్కువగా ఉండడంతో ప్లాట్లు తక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్లాట్ల నుంచే 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కూడా వెళ్తున్నది. ఇప్పటికే రైతులకు సరిపడా ప్లాట్లు లేకపోగా.. మరోవైపు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కూడా వెళ్తుండడంతో మరికొన్ని ప్లాట్లు రోడ్డులో పోయే ప్రమాదం ఉన్నది. కొత్తగా మరికొన్ని ప్లాట్లుచేసి ఇస్తామని అధికారులు చెబుతున్నా రైతులు నమ్మడంలేదు. దీంతో బాధిత రైతులకు ఇప్పట్లో ఇంటి స్థలాలు వస్తాయా..? అనేది పలు అనుమానాలకు దారి తీసింది.