రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల కిందట ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు.. నష్టపోయిన రైతులే కనిపించేవారు.. కానీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాక.. విత్తనాల్లో నకిలీల బెడద తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు పెను మార్పులు తీసుకొచ్చాయి. పోలీసు కేసులు..పీడీ యాక్ట్‌ల నమోదుతో నకిలీ విత్తన కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం సైతం గత ప్రభుత్వ విధానాలనే అమలుచేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడంతో ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు నాలుగే కేసులు నమోదయ్యాయి. అక్రమార్కుల్లో నెలకొన్న దడ..రైతుల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా ఒకప్పటి నకిలీల బెడద తీవ్రత ఇప్పుడు లేదన్న మాట అధికారవర్గాల నుంచి సైతం వినిపిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో వానకాలం సాగును రైతులు 4.45 లక్షల ఎకరాల్లో చేపట్టే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో పత్తి 1.76 లక్షల ఎకరాల్లో.. వరి 1.38 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 66వేల ఎకరాలు, మిగతా ఎకరాల్లో జొన్న, పెసర్లు, కందులు, మినుములు, వేరుశనగ, ఆముదం తదితర పంటలను రైతాంగం సాగు చేయనున్నది. ఇప్పటికే సాగును మొదలుపెట్టిన రైతులు 53,971 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 38 వేల ఎకరాల్లో పత్తిని వేశారు. ఈ క్రమంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మంచి దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపికే కీల కం. ఈ నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. దళారులతో సహా దుకాణాల్లోని వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో కలెక్టర్ చైర్మన్‌గా పోలీసు, వ్యవసాయ, సీడ్ కార్పొరేషన్ శాఖలతో సంయుక్తంగా ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ బృందం యాక్టివ్‌గా పని చేస్తున్నది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఏడీఏ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇక మండల స్థాయిలో ఏవోల ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ శాఖలతో బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీజన్ పొడవునా..ఆయా బృందాలు విత్తనాలు, ఎరువుల షాపుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
దుకాణాల డీలర్లతో సమావేశాలు నిర్వహించి అమ్మకాల్లో నిబంధనలు పాటించాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సూచిస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు నకిలీ విత్తనాలు తరలించకుండా పటిష్ట నిఘాను ఉంచుతున్నాయి. పోలీసుకేసులు, పీడీయాక్ట్ వంటి భయాలతో అక్రమార్కులు సైతం నకిలీలను విక్రయించేందుకు సాహసించడంలేదు. మరోపక్క సీజన్ ఆరంభంలోనే ఏఈవోలతో ప్రతి గ్రామ పంచాయతీలోనూ రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన సమావేశాలను నిర్వహించారు. గత పదేండ్లుగా తీసుకుంటున్న పటిష్ట చర్యలతో మేలు రకమైన విత్తనాలు లభిస్తున్నాయన్న భావన రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.
బ్రాండెడ్ మాటున నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టకుండా వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. వ్యవసాయశాఖ గుర్తించిన ఆధీకృత కంపెనీ పత్రాలతో పలు కంపెనీలు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాక బ్రాండెడ్ పేరుతో నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. మరోవైపు జెర్మినేషన్ సైతం సరిగా లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని కాపాడేందుకు వ్యవసాయశాఖ జిల్లాలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ర్యాండమ్‌గా పత్తి, వరి వంటి విత్తనాల నమూనాలను సేకరిస్తున్నది.
సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపిస్తున్నది. 15 రోజుల తర్వాత ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా విత్తనాలు సాగుకు అనుకూలం కాకపోతే సదరు షాపుల్లో విక్రయాలను నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొంతకాలంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి పర్యవేక్షణలో ఆరుగురు ఏడీఏలు, 22 మంది ఏవోలు, 83 మంది ఏఈవోలు ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు 300 వరకు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతం గా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీజన్ పూర్తయ్యే వరకూ అన్ని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసి విత్తన నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తాం. ఫలితాల ఆధారంగా డీలర్లు, సదరు కంపెనీలపై చర్యలు తీసుకుంటాం.
-గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి