పరిగి, ఆగస్టు 7 ః మున్సిపల్ పరిధిలోని పార్కులలో సదుపాయాలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలోని పార్కులను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పార్కులలో యోగా బెడ్స్ ఏర్పాటు, కాలినడక బాటలు, పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన పరికరాలు సమకూర్చాల్సిందిగా చెప్పారు. ప్రైవేటు లే అవుట్లలో సైతం పార్కుల అభివృద్ధికి యజమానులను ప్రోత్సహించాలని సూచించారు.
స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలను భాగస్వాములను చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం తుంకులగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకులాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలతోపాటు భోజన సౌకర్యంపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పాఠశాల గదులకు మరమ్మతులు చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, తహసీల్దార్ ఆనంద్‌రావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కమిషనర్ వెంకటయ్య, అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.