పెద్దఅంబర్‌పేట, ఫిబ్రవరి 21: మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. ప్రజలు పెద్దసంఖ్యలో కంటి వెలుగు శిబిరాల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న వైద్యులు.. సహనంతో వారిని పరీక్షిస్తున్నారు. అవసరమైనవారికి అక్కడే ఉచితంగా కండ్లద్దాలను అందజేస్తున్నారు. కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నవారిని శస్త్రచికిత్స కోసం రెఫర్ చేస్తున్నారు. కార్యక్రమంలో కంటి వెలుగు శిబిరం ఇన్చార్జి యాదగిరి, వైద్యులు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
తిప్పాయిగూడలో..
మంచాల : తిప్పాయిగూడ గ్రామంలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ పాండు ప్రారంభించారు. శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుకన్య, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, వార్డు సభ్యులు సురేశ్, స్వప్న, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, డాక్టర్ ప్రదీప్, సతీశ్ పాల్గొన్నారు.
కంటి వెలుగుకు విశేష స్పందన
యాచారం : గున్గల్, తక్కళ్లపల్లి గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. రెండు గ్రామాల్లో 253 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 18 మందికి అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ప్రియాంక, శోభారాణి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఉన్నారు.
చేవెళ్ల మండలంలో
చేవెళ్ల రూరల్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి స్పందన లభిస్తున్నది. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందజేశారు. శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.