షాబాద్, మే 31: గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 9,782 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డిజిల్లాలో..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 9,782 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 345 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 402 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
బొంరాస్పేట, మే 31 : జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లాలో 3083 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 98 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 171 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 524 గ్రామాలు, 97 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.