పరిగి, ఏప్రిల్ 5 : విద్యార్థుల భవిష్యత్‌పై బీజేపీ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్ అధ్యక్షతన పరిగి పురపాలక సంఘం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసేలా బీజేపీ నేతలు ప్రశ్నాపత్రం ఫొటో తీసి వాట్సప్‌ల్లో సర్కులేట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుటీల యత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌పై బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. 8 ఏండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ పాలన చేసిందా..? అని మంత్రి ప్రశ్నించారు. నల్లధనం తీసుకువచ్చి ప్రతిఒక్కరి అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారని, ఎవరికైనా వేశారా..?, ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణలో జెండా పట్టుకొని తిరుగుతారని బీజేపీ నాయకులను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారని, రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.1200లకు పెంచారని మంత్రి విమర్శించారు.
పెంచిన ధరలను తగ్గించమని మోదీని అడగలేని అసమర్థులు.., సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను విమర్శించడం సరికాదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని కంపెనీలను అమ్మేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పరిగి నియోజకవర్గంలో మహేష్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించే దిశగా కృషి చేయాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. 40 సంవత్సరాలుగా పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డితోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాలుపంచుకున్నారని కొనియాడారు. పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 15పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారని, కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారన్నారు. పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి జిల్లాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటుచేసి 5లక్షల మంది విద్యార్థులకు విద్య అందించడం జరుగుతుందని అన్నారు. గురుకులాలను జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ, పీజీ, లా కళాశాలు ఏర్పాటు చేస్తూ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తున్నారని తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 80వేలకు పైగా ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు వేయగా, ఓ పార్టీ నాయకులు కుట్ర కోణంతో అడ్డుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 8 ఏండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. రూ.60వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం అందజేసిందన్నారు. 45 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు అందజేస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పరిగి పురపాలక సంఘానికి రూ.15కోట్లు మంజూరు చేశారని, మరో రూ.25కోట్లు ఇస్తామని చెప్పారన్నారు. వచ్చే నెలలో మంత్రి చేతులమీదుగా పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. గత పాలకుల హయాంలో ఎండాకాలం వచ్చిందంటే మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టేవారని, ప్రస్తుతం మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందుతుందని తెలిపారు. అంతకుముందు పరిగిలోని మార్కెట్‌యార్డులో దుకాణాల భవన సముదాయం నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ విశ్వనాథ్‌గౌడ్ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, పరిగి, కులకచర్ల ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎం.సంతోష్, కౌన్సిలర్లు అర్చన, వి.కిరణ్, వి. రవీంద్ర, ఎ.కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్రావు, మునీర్, బీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, మౌలాన, తాహెర్‌అలీ, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.