Govt Schools | షాబాద్, మే 17: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్ కోరారు. శనివారం షాబాద్ మండలంలోని ఎల్గొండగూడ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలో 40 మంది విద్యార్థులు ఫ్రైవేట్ పాఠశాలలకు వెళ్తుండగా, అందులో నుండి 25 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేపడుతున్నట్లు వివరించారు. అర్హత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులచే విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రహారీ గోడ గేట్ అదే గ్రామానికి చెందిన దాత రవీందర్‌రెడ్డి ఏర్పాటు చేయిస్తున్న గేట్‌కు భూమిపూజ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, గ్రామస్తులు రవీందర్‌రెడ్డి, యాదయ్య, బలరాం, శ్రీనివాసచారీ, మల్లారెడ్డి, సతీశ్, రవి, శేఖర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.