పరిగి, మార్చి 23 : ప్రజాస్వామ్యబద్ధ్దంగా ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అన్ని గ్రామాలు సమానమే. కానీ, కాంగ్రెస్ ప్రజాపాలనలో తమ పార్టీ వారు గెలిచిన గ్రామాలే ముఖ్యం. లేదంటే సదరు సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరితేనే ఆయా గ్రామాలకు నిధులు కేటాయిస్తామంటూ చెప్పడమే కాకుండా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల కేటాయింపులో బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలపై తీవ్ర వివక్ష చూపుతున్నారు. గత డిసెంబర్లో పంచాయతీలకు ఎన్నికలు జరుగగా పరిగి సెగ్మెంట్లోని ఏడు మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పలుచోట్ల గెలుపొందారు.
పరిగి మండలంలో 32 గ్రామపంచా యతీలున్నాయి. అందులో రెండు గ్రామాలు ఏకగ్రీవం కాగా.. 30 పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా 19 గ్రామాల్లో సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. నేరుగా పంచాయతీలకు వచ్చే నిధులతోపాటు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ప్రత్యేకంగా నియోజకవర్గానికి కేటాయిస్తారు. పరిగి సెగ్మెంట్లోని వికారాబాద్ జిల్లా పరిధిలో గల ఐదు మండలాలకు సుమా రు రూ. 8.70 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరయ్యాయి. పరిగి మండలంలో 20 పనులకు రూ.1.25 కోట్లు, పూడూరులో 37 పనులకు రూ. 2.29 కోట్లు, దోమలో 34 పనులకు రూ. 2.14 కోట్లు, కులకచర్లలో 30 పనులకు రూ. 1.50 కోట్లు, చౌడాపూర్‌లో 21 పనులకు రూ. 1.52 కోట్లు వచ్చాయి.
కాగా, బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న చోట ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఈ నిధులు కేటాయించిన గ్రామాల్లో పంచాయతీల తీర్మానం మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌లోకి వస్తేనే నిధులు కేటాయిస్తామని పలు గ్రామాల సర్పంచ్‌లకు ఆ పార్టీ కండువాలను కప్పుతున్నారు. బీఆర్ఎస్పై అభిమానమున్న సర్పంచ్‌లు ఆ పార్టీని వీడకపోవడంతో నిధులు కేటాయించడంలేదని పలువురు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్నచోట కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించగా కాంగ్రెస్ ప్రజా పాలనలో వివక్ష చూపించడంతో బీఆర్ఎస్ సర్పంచ్‌లు పోరుబాటకు సిద్ధమయ్యారు.
ఆందోళనకు సిద్ధం..
తమ గ్రామపంచాయతీలకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించకపోవడంపై అవసరమైతే ఆందోళనకు సిద్ధమని పరిగి మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు స్పష్టం చేశారు. సోమవారం పరిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదారం, మిట్టకోడూర్, రంగాపూర్, తొం డపల్లి, చిట్యాల్, నారాయణపూర్, ఖుదావంద్‌పూర్, బసిరెడ్డిపల్లి, రూప్‌ఖాన్‌పేట్, రాఘవాపూర్, ఇబ్రహీంపూర్ సర్పంచ్‌లు రాములు, మాణిక్యం, కరణం మందాకిని, కృష్ణ, చింతగల్ల రాజు, సత్యనారాయణరెడ్డి, మోదె యాదయ్య, మంజుల, అంజిలమ్మ, హన్మయ్య, స్రవంతి, బురుగు ఆశప్పలు పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పరిగి మండలంలోని బీఆర్ఎస్ సర్పంచ్‌లు గల గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించకపోవడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. సర్పంచ్ల శిక్షణా శిబి రంలో సర్పంచ్‌లందరూ తనకు సమానమేనని చెప్పిన ఎమ్మెల్యే నిధుల కేటాయింపులో వివక్ష చూపడం సరికాదని వారు వాపోయారు. తమ గ్రామాలకు నిధులు కేటాయించే వరకు పోరాడుతామని.. కలెక్టర్, మంత్రి, అవసరమైతే సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అన్ని గ్రామాలను సమానంగా చూడాలి..
ప్రజల ఆమోదంతోనే సర్పంచ్‌లుగా గెలిచాం. స్థానిక ఎమ్మెల్యే మండలంలోని అన్ని గ్రామా లను సమానంగా చూడాలి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించాలి. కేవలం కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకే ఆ నిధులు కేటాయించడం సరైన విధానం కాదు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామపంచాయతీలపై వివక్ష మాని నిధులు కేటాయించాలి. -కరణం మందాకిని, సర్పంచ్, రంగాపూర్
ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారు..
బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను కేటాయించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీలు చూడకుండా అన్ని గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష కొనసాగుతున్నది. నిధులను సాధించుకునేందుకు అవసరమైతే ధర్నా చేస్తాం.
-బోయిని రాములు, సర్పంచ్, మాదారం
వచ్చిన పనులను రద్దు చేశారు..
మా గ్రామానికి డ్వాక్రా భవనం, ఉన్నత పాఠశాలకు ప్రహరీ మంజూరు కాగా బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారనే కారణంతో వాటిని రద్దు చేసి, ఇతర గ్రామాలకు ఆ నిధులను మళ్లించారు. అన్ని గ్రామాలను సమానంగా చూస్తానన్నా స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకే నిధులు కేటాయించి.. బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఆపేశారు. నిధులు కేటాయించకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం, పోరాటాన్ని ఆపేది లేదు. -పి.మాణిక్యం, సర్పంచ్, మిట్టకోడూర్