సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టును చేపట్టడం కంటే భూసేకరణ వ్యవహారాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. కొత్త భూసేకరణ చట్టం-2013 ప్రకారంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే వెడల్పు 150 ఫీట్లకు తగ్గించాలంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విలువైన భూములను లాక్కోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడిచినా తట్టెడు మట్టి తీయలేదు.
భూసేకరణలో స్పష్టత ఇవ్వకపోవడం.. పరిహారంలో పారదర్శకత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఎలివేటెడ్ కారిడార్ బాధితులు విసిగిపోతున్నారు. న్యాయం కావాలని వందలాది మంది ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ప్రాజెక్టును ప్రతిపాదించి ఏండ్లు గడుస్తున్నా.. కనీసం భూసేకరణ పూర్తికాలేదు. దీనికి ప్రధాన కారణం భూసేకరణ పరిహారం తేల్చకుండా ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు జారీ చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు ప్రాజెక్టు వెడల్పును తగ్గించిన తర్వాతే పరిహారం కూడా చర్చిస్తామని కూడా స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వకుండానే ఏడాది కాలంగా కాలయాపన చేస్తున్నది. రాజీవ్ రహదారి భూ నిర్వాసితుల జేఏసీ ఆధ్వర్యంలోనే సామూహిక నిరసనలు, ఆందోళనలతో బాధితులు ప్రతిఘటిస్తున్నారు.
ప్రభుత్వం భూసేకరణ పరిహారాన్ని తేల్చకుండా ఇంటింటికీ నోటీసులు అంటించడం, కూల్చివేతలకు ఆస్తులను గుర్తించడంతో బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో ఇటీవల జరిగిన భూసేకరణపై ప్రభుత్వం డైలమాలో పడింది. కొత్త భూసేకరణ చట్టం-2013 ప్రకారంతో తమకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రాజెక్టు వెడల్పును కూడా కచ్చితంగా 150 ఫీట్లకు తగ్గించిన తర్వాతే ప్రాజెక్టుకు భూములు ఇవ్వడంపై చర్చిస్తామని బాధితులు చెబుతున్నారు. గతంలో నగరంలో నిర్మించిన మెట్రో సంస్థకు కూడా ఇదే తీరుగా పరిహారం చెల్లించారని, దీంతోనే తమకు లాభం జరుగుతుందని జేఎసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పరిహారంతో భూములు సేకరించాలని చూడటమే.. ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు భూ యజమానులు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.