షాబాద్, ఏప్రిల్ 7 : పంటలు పొట్ట కొచ్చి గింజబట్టే దశలో రైతులకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకొని సమస్యలు పరిష్కరించకుండా విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భారతీయ కిసాన్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవరెడ్డి అన్నారు. షాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం భారతీయ కిసాన్ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగులో రైతుకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకున్న అధికారులు డబ్బులకు ఆశపడి సకాలంలో సమస్య పరిష్కరించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సమస్య పరిష్కరించండనీ రైతులు కాళ్లు మొక్కిన అధికారులు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ మండల పరిధిలోని బోనగిరిపల్లి సర్వేనెంబర్ 47 లో విద్యుత్ స్తంభం విరిగిపోయి కరెంట్ సరఫరా ఐదు రోజులుగా నిలిచిపోయిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. రైతులు ఈ విషయమై విద్యుత్ అధికారులకు తెలియజేస్తే. వారు పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని.. మీ పని త్వరగా కావాలంటే డబ్బులు చెల్లిస్తే.. ప్రైవేటు వ్యక్తులతో తొందరగా చేయిస్తామని లైన్ ఇన్స్పెక్టర్ చెప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చేయాల్సిన పనిని రైతులతో చేయిస్తూ, వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. నాగరకుంట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోవోల్టేజీ కారణంగా బోరు నడవడం లేదని, దామర్లపల్లి గ్రామ వ్యవసాయ బోరు మోటర్లకు వెళ్లే లైన్లు లూప్ లైన్లు ఉన్నాయని వాటిని సరిచేయాలని కోరారు. అలాగే అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం షాబాద్ విద్యుత్ ఏఈని కలిసి ఈ మేరకు వినతి ప్రతాన్ని అందజేశారు.