Chilukur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి13: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడి ఘటన కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి పురోగతి సాధించాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు వేగం పెంచారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల అరెస్టుల పర్వం రోజూ కొనసాగుతోంది. బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా గురువారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా వాసులు కోపెల లక్ష్మణ్‌రావు, ముత్యాల వెంకటేశ్వర్లు, శ్రీకాకుళానికి చెందిన ముప్పిడి వెంకటరమణ, జనపాల గోవిందరావు, దేవిరెడ్డి వీరబాబు, బడావత్తు శ్రీనివాస్, రేగణ మూర్తిలకు గురువారం వైద్య పరీక్షలు పూర్తి చేసి రాజేంద్రనగర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హజరు పర్చారు. వీరందరిని మొయినాబాద్ ప్రాంతంలోని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ జీ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మరో రెండు బృందాలు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరో వైపు చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తుతో పాటు ఆలయ అర్చకులు రంగరాజన్ ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించామని తెలిపారు.
దాడి ఘటనతో అర్చకులు సీఎస్ రంగరాజన్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 7న ఆయనపై దాడి చేయగా మరునాడు రాత్రి ఆయన మొయినాబాద్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రధాన నిందితుడు పారిపోయే పరిస్థితి ఉండేదని సమాచారం. ఆయన నివాసం ఉన్న మణికొండ నుంచి పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అర్చకుడు రంగరాజన్ ఇప్పటికీ ఆ ఘటన షాక్ నుంచి కోలుకోలేదు. ఉదయం సమయంలో బాలాజీకి అర్చన పూజ చేశాక.. ఆయన ఎక్కువ సమయం వృద్యాప్యంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ వద్దే గడుపుతున్నారు. దుండగులు ఆయన్ని నేలపై పడేసి కాళ్లతో తన్నడంతోపాటు ముఖంపైన పిడి గుద్దులు కురిపించడంతో ఆ ఘటన నుంచి తేరుకోలేదు. తనను పరామర్శించేందుకు వస్తున్న వారితోను జరిగిన ఘటనను భాధాతత్ప హృదయంతో చెప్పే తీరు అందరిని ఆవేదనకు గురి చేస్తున్నది. ఆలయానికి వచ్చే భక్తులు సైతం రంగరాజన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఇక పోన్లలో పరామర్శలు కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు ఉండగా ఇక్కడి అర్చకులతోను అవినాభావ సంబంధాలు ఉన్న విదేశాల్లోని ప్రవాస భారతీయులు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.