ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 8: ప్రస్తుతం టీవీ సీరియళ్లు, సినిమాలపై మహిళలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ఈ సమయాన్ని ఆర్థికాభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు కేటాయించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం సమీపంలోని కళ్లెం జం గారెడ్డి గార్డెన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై.. ముందుగా పలువురు మహిళలను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వం రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి త్వరలో అందజేయనున్న రూ. మూడు లక్షలను నా సెగ్మెంట్లో మొత్తం మహిళల పేర్లపైనే అందిస్తానని హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్, మంచాల మండలాలకు చెందిన 283 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 197మంది, మంచాల మండలంలో 86 మంది కి చెక్కులను అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డ వివాహానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం ఆయన పలువురు మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవం తి, చెవుల స్వప్న, వైస్ చైర్మన్ కళమ్మ, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మాధవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఉత్తమ మహిళలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.