అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచితే జిల్లాలోనే మజీద్‌పూర్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి నిర్వహించిన బడి పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జడ్పీటీసీ బింగి దేవదాస్‌గౌడ్, ఎంపీటీసీ మేడిపల్లి బాలమ్మ, తాజామాజీ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్‌రెడ్డితో కలిసి పాఠశాలలో కంప్యూటర్ గది, సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీఈవో సుశీందర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున బడి పండుగ నిర్వహిస్తారని ఊహించలేదన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచితే జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. ఉద్యమంగా కదులుదాం.. ఊరి బడిని కాపాడుకుందాం.. బడి మనదే.. బడి బాగోగుల బాధ్యత కూడా మనదే.. అనే నినాదం, ఇంటికి – వంద.. బడికి చందా స్ఫూర్తితో గ్రామంలోని ఇంటింటా విరాళాలు సేకరించి ఊహించని రీతిలో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు.
ఇంతటి కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువకులు, మహిళలు, విద్యాభిమానులు, దాతలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం దాతలకు సిర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర, మాజీ ఎంపీటీసీ కసరమోని లక్ష్మయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి, విద్యా కమిటీ చైర్పర్సన్ నందగిరి భాగ్యమ్మ, దాతలు మేడిపల్లి వెంకటేశ్‌గౌడ్, కక్కెర్ల జంగమయ్యగౌడ్, కాంటేకార్ రమేశ్, ఎడ్ల మహేందర్ ముదిరాజ్, గోపగోని శ్రీశైలంగౌడ్, ఐలయ్య, మేడిపల్లి బాల్‌రాజ్‌గౌడ్, పోచంపల్లి నరేందర్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.