కడ్తాల్ : నిత్యం యోగా, ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతాత లభిస్తుందని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురిలో గల మహేశ్వర మహా పిరమిడ్‌లో జరుగుతున్న మహిళా ధ్యాన మహాసభలు శుక్రవారం ముగిశాయి. ఆఖరిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పత్రీజీ వేణుగానం, సంజయ్కింగీల సితారాలతో ప్రాతఃకాల ధ్యానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా ధ్యానులద్ధేశించి పత్రీజీ మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళా అని, స్త్రీమూర్తులను మనమందరం గౌరవించాలని పేర్కొన్నారు. మనిషి సకలం నేర్చుకోవడానికే భూమి మీదకు వచ్చాడని తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ధ్యానం చేయవచ్చని, నిత్యం ధ్యానసాధన చేయడంతో రోగాలు దరిచేరవని, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానమని తెలిపారు. అనంతరం పిరమిడ్ ప్రధాన వేదికపై ప్రజాప్రతినిధులను, ట్రస్ట్ సభ్యులను, వాలంటీర్లను సుభాశ్ పత్రీజీ ఘనంగా సన్మానించారు. పలు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు.
ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభ్కార్రెడ్డి, సభ్యులు స్వర్ణమాలపత్రీజీ, సాంబశివరావు, హనుమంతురాజు, శ్రీరాంగోపాల్, ప్రేమయ్య, దామోదర్‌రెడ్డి, లక్ష్మీ, జయశ్రీ, సౌమ్మకృష్ణ, మాధవి, రవిశాస్త్రి, సాగర్, రాంబాబు, శివప్రసాద్, బాలకృష్ణ, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.