కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న నాణ్యమైన 24 గంటల కరెంట్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు నిండినవి. రాత్రి పొలాల దగ్గరికి పోయే తిప్పలూ తప్పినయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు 3గంటల కరెంట్ చాలు.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నది. అది అసలు సాధ్యం కాదు. లోవోల్టేజీ సమస్య ఏర్పడి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. అంతేకాకుండా బోరుబావులు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులొస్తాయి. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న కేసీఆర్‌నే మళ్లీ గెలిపించుకుంటాం.
– ప్రభాకర్, రైతు, కమ్మెట గ్రామం, చేవెళ్లటౌన్
వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు.. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడాలి.. అన్న రేవంత్ వ్యాఖ్యలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే గతంలో కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలను చవిచూసిన రైతులు.. మరోసారి ఆ పార్టీ విధానాలను విని ఉలిక్కిపడుతున్నారు. అప్పటి కరెంటు కోతలు, ఆగమైన బతుకులను గుర్తు చేసుకుని కలవరపడుతున్నారు. పెద్ద మోటర్లతో బోర్లలో ఊట తగ్గి పొలమంతా పారే పరిస్థితి ఉండదన్నారు.
లోవోల్టేజీ సమస్య ఏర్పడి మోటర్లు, బోర్లు కాలిపోయి మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ల స్థానంలో 10 హెచ్‌పీని ఏర్పాటు చేయడమంటే జిల్లా రైతులపై రూ.1200కోట్ల మోయలేని భారం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్వరాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరాయని, కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయంటున్నారు. రాత్రిపూట లాంతర్ల పట్టుకొని పొలాలకు వెళ్లే గడ్డు పరిస్థితులు వస్తాయని, మరోసారి సీఎం కేసీఆర్‌కే పట్టం కడుతామని అన్నదాతలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
-రంగారెడ్డి, నవంబరు 17(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి 3 గంటల కరెంటు.. ఈ మాట వింటేనే రైతులు ఉలిక్కి పడుతున్నారు. ఇక 10 హెచ్‌పీ మోటర్లు అంటే.. అన్నదాతలు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తీవ్ర అనర్థాలను చవిచూసిన రైతాంగం.. అప్పటి బతుకులను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నది. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ల స్థానంలో 10 హెచ్‌పీ మోటర్లను ఏర్పాటు చేయడమంటే రూ.1200కోట్ల భారాన్ని మోయక తప్పదని రైతులు పేర్కొంటున్నారు. స్వరాష్ట్రంలో అనతికాలంలోనే సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని 1,20,713 వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. కరెంటు కష్టాలు తీరి.. సంతోషంగా జీవిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంటు గోసలే వస్తాయని రైతాంగం మండిపడుతున్నది.
వ్యవసాయ పంపుసెట్లకు 10 హెచ్‌పీ మోటరును వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. తీవ్రమైన విద్యుత్తు నష్టంతోపాటు బోర్లలో ఊట తగ్గి పొలాలకు పూర్తిస్థాయిలో నీరు పారే పరిస్థితి లేకుండా పోతుంది. రంగారెడ్డి జిల్లాలో 1,20,713 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లనే వాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ వల్ల సమయం ఉన్నప్పుడే మోటర్లను నడిపిస్తున్నారు. బోర్లలో నీటి ఊట తగ్గడం లేదు.. పొలం నలుమూలలా నీరు పారుతుంది. అదే బోరుకు 10 హెచ్‌పీ మోటరును అమర్చడం వల్ల పది నిమిషాల్లోనే ఊట అంతా బయటకు వచ్చేసి పొలం అంతా నీరు పారే పరిస్థితి ఉండదు. వరి చేను, కూరగాయల పంటలు నీటి తాకిడికి కొట్టుకుపోవడమే కాకుండా..డ్రిప్ పైపులు సైతం పగిలిపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
10 హెచ్‌పీ మోటర్లతోపాటు కొత్తగా పైపులైన్ ఏర్పాటు చేసుకోవడం రైతులకు మోయలేని భారమవుతుంది. ప్రస్తుతం వివిధ కంపెనీలకు సంబంధించిన 10 హెచ్‌పీ మోటర్ల ధర రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఉన్నది. పైపులు, స్టార్టర్లు, ఇతర సామగ్రికి మరో రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా జిల్లా రైతాంగం రూ.1200కోట్ల భారాన్ని మోయాల్సి వస్తుంది. కరెంటు వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో డిమాండ్ తగ్గట్టుగా కరెంటు సరఫరాను ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో మళ్లీ కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎదురైన పరిస్థితులు వస్తాయని రైతాంగం ఆందోళన చెందుతున్నది. వ్యవసాయానికి ఏడు గంటలు ఇస్తున్నట్లు చెప్పినా.. ఇచ్చింది మూడు గంటలే.. కరెంట్ కోసం రైతులు రాత్రిళ్లు జాగారం చేయాల్సి వచ్చేది. పాము కాటుకు బలై కొందరు.. కరెంటు తీగలే యమపాశాలై మరి కొంతమంది రైతులు మృత్యువాత పడ్డారు. నిన్నమొన్నటి వరకు 3 గంటల కరెంటు అన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 10హెచ్‌పీ మోటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. పొరుగున ఉన్న రాష్ర్టాలు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో విఫలమయ్యాయి. కర్ణాటకలో ఇటీవల అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో చతికిల పడిపోయింది. కానీ.. సీఎం కేసీఆర్ విద్యుత్తు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా అయ్యేది. ప్రస్తుతం రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. గతంలో కంటే విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ కరెంటు కోతలు అసలే లేవు. జిల్లాలో రోజువారీ సగటు విద్యుత్తు వాడకం 21.46 మి.యూ. ఉండగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ 784.73 మెగావాట్లు ఉంటోంది.
మెరుగైన విద్యుత్ సరఫరా కోసమే ప్రభుత్వం 3,198కోట్లను ఖర్చు చేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా బోర్లు, బావుల కింద పంటల సాగు పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి జిల్లాలో 33/11కేవీ సబ్ స్టేషన్లు 181 ఉండగా.. కొత్తగా 276 సబ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 1,20,713 కనెక్షన్లు ఉండగా, ఆయా రైతులకు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. గత కొన్నేండ్లుగా అధిక మొత్తంలో పంట దిగుబడులను పొందుతున్నామని రైతులు సగర్వంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో అందిస్తున్న నాణ్యమైన విద్యుత్తుపై రైతు కుటుంబాల నుంచి సంతోషం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు కేవలం 3 గంటల విద్యుత్తు సరఫరా సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనడం హ్యాస్యాస్పదం. 10 హెచ్‌పీ మోటర్లతో మొత్తం పొలానికి నీరు పారించుకోవచ్చని ఆయన మాట్లాడటం సరికాదు. రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి… నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కే మా మద్దతు.
– నరోత్తం రెడ్డి, రైతు, చేవెళ్ల గ్రామం(చేవెళ్ల రూరల్)
3 గంటల విద్యుత్తు సరఫరా చేస్తే రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఏ లెక్క ప్రకారం అన్నాడో చెప్పాలి. ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయే పరిస్థితి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తుండు. 10 హెచ్‌పీ మోటర్ వల్ల భూగర్భ జలాల తగ్గుతాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడ వల్ల ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారు.
– సామ మాధవరెడ్డి, మోటర్ వైండింగ్ షాపు యాజమాని, (మొయినాబాద్)
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడాదికి మూడు సార్లు మోటర్లు కాలిపోయేవి. పది ఏండ్ల నుంచి వ్యవసాయం సాఫీగా సాగుతున్నది. 24 గంటల కరెంట్ వల్ల రైతులు అందరు ఒకే సారి మోటర్లు పెట్టరు. సమయం ఉన్నప్పుడు మోటర్లు పెట్టడం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడటం లేదు. 3 గంటల కరెంట్ వస్తే రైతులకు అన్ని కష్టాలే వస్తాయి.
– మాల మహేందర్, వైండింగ్ మెకానిక్, సురంగల్, (మొయినాబాద్)
మూడు గంటల కరెంట్ అంటే రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయి. 10 హెచ్‌పీ మోటరు బిగిస్తే ఉన్న ట్రాన్ఫార్మర్లపై లోడ్ ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉన్నది. మోటరు, పైపులు, వైరుకు మొత్తం రూ.లక్షకుపైనే ఖర్చు వస్తది. మన ప్రాంతంలో వరి సాగు ఎక్కువ ఉంటుంది. వరికి సాగునీరు ఎక్కువ అవసరం ఉంటుంది. మూడు గంటల్లో బోరులో ఉన్న నీరంతా గుంజేస్తే బోర్లు ఎండి పోతాయి. రైతులను మళ్లీ ఆగం చేసేటట్టుంది ఈ కాంగ్రెస్.
– గొల్ల అనంతయ్య, మంగంపేట్ గ్రామం(మహ్మదాబాద్)
వ్యవసాయానికి 10హెచ్‌పీ మోటర్లతో పనిలేదు. 5హెచ్‌పీ మోటర్లతో పుష్కలంగా నీళ్లు వస్తాయి. 100కేవీ ట్రాన్స్ఫార్మర్కు వ్యవసాయానికి సంబంధించి 5హెచ్‌పీ మోటర్లు 30 నడిపించవచ్చు. 10హెచ్‌పీ వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ ఎక్కువై కాలిపోయే ప్రమాదం ఉన్నది. భూగర్భజలాలు తగ్గుతాయి. ప్రస్తుతం భూగర్భజలాలు పెరగడం ద్వారా 200 పీట్లలోనే నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలో వ్యవసాయ పొలాల వద్ద 5హెచ్‌పీ మోటర్లు మాత్రమే ఉన్నాయి.
– విఠల్‌రాజ్, బోరు మోటర్ మెకానిక్(షాద్‌నగర్‌టౌన్)
మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ మాకొద్దు.. 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టే మళ్లీ అధికారంలోకి రావాలి. ఇప్పటికే కాంగ్రెసోళ్లు ఫిర్యాదు చేసి రైతు బంధు డబ్బులు ఆపేశారు. గతంలో బాయికాడా రాత్రి పూట పడుకునేటోళ్లం. పాములు, తేళ్లకు ఎంతో మంది బలైపోయారు. ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ నాయకులు రైతుల ఉసురుపోసుకుంటున్నారు. ఓటుతో రైతులందరూ కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– నర్సింహులు, పర్వతాపూర్(తాండూరు రూరల్)
తెలంగాణ రాష్ట్రంలో రైతులు సీఎం కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలనడం రైతు వ్యతిరేక చర్య. 10 హెచ్‌పీ మోటర్లు మాలాంటి సన్నకారు రైతులు 50 వేలు ఖర్చు చేసి ఎలా తెచ్చుకుంటారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ వస్తుంది. రైతు బంధు, రైతు బీమా వస్తుంది. కాంగ్రెస్ హామీలను రైతులు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. రైతులంతా కేసీఆర్ వెంటే ఉండి మరోసారి సీఎంను చేసుకుంటాం.
– మధు (శంకర్పల్లి)
రైతులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. కాంగ్రెసోళ్లు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 3 గంటల కరెంట్ వల్ల నష్టపోయాం. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడిప్పుడే వ్యవసాయం గాడిల పడింది. మళ్లీ కాంగ్రెసోళ్లు ఆగం చేయాలని చూస్తుండ్రు. మా మద్దతు బీఆర్ఎస్కే.
– కాలె వీరయ్య, రైతు (ఆమనగల్లు మున్సిపాలిటీ)
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఏ లెక్కన సరిపోతుంది. ఎకరం పొలం కూడా పారదు. నేను 30 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గత ప్రభుత్వాలు ఇచ్చిన కరెంటు ఎంతో తెలుసు.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే నిరంతర విద్యుత్తు తెలుసు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే రైతుల మద్దతు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి.
– గోరేటీ మల్లయ్య (కడ్తాల్)
మూడు గంటల కరెంట్ ఇస్తం.. 10 హెచ్‌పీ మోటర్ పెట్టాలె.. అంటే పైసలేడా తేవాలి.. రేవంత్‌రెడ్డి మతి ఉండే మాట్లాడుతుండా.. రైతుల కష్టం తెలుసా.. 10 హెచ్‌పీ మోటరు వల్ల బోరులోని నీళ్లన్నీ తోడేస్తుంది. ఉన్న పంట ఎండిపోయి మొదటికే మోసం వస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకే రైతులమంతా మద్దతు తెలుపుతాం.
– లక్ష్మీనారాయణ, దుప్‌చెర్ల, బొంరాస్‌పేట మండలం