ఇబ్రహీంపట్నం, జూలై 23 : నగర శివారులోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. ఓ వైపు ఎస్వోటీ పోలీసులు మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంతో నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ హాస్టళ్లలో ప్రత్యేక బృందాలతో దాడులను ముమ్మరం చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సెగ్మెంట్లలో కలిపి 30 వరకు ఇంజినీరింగ్ కాలేజీలు, వంద వరకు ప్రైవేట్ హాస్టళ్లున్నాయి. ఈ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను లక్ష్యం గా చేసుకుని డ్రగ్స్, గంజాయి విక్రయదారులు రెచ్చిపోతున్నారు. మత్తు పదార్థాలను వివిధ రూపాల్లో వారికి చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలల పరిసరాల్లో ఉన్న హోటళ్లు, పాన్‌షాపులు డ్రగ్స్ విక్రయానికి కేంద్రంగా మారాయి.
ఇటీవల ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పదిహేను మంది విద్యార్థులు డ్రగ్స్ వాడుతూ నార్కోటిక్ పోలీసులకు చిక్కారు. అలాగే, మంగల్‌పల్లి సమీపంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం డ్రగ్స్‌కు కేంద్ర బిందువుగా మారిపోతున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన వ్యాపారులకు ఇబ్రహీంపట్నంతో సంబంధమున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి కళాశాలల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతుండడంతో వారికి అన్ని దేశాల వారితో సంబంధాలుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని ఆయా కళాశాలల విద్యార్థులకు చేరవేస్తున్నారు. ఇటీవల మంగల్‌పల్లి, బొంగుళూరు, ఇబ్రహీంపట్నం, బీఎన్‌రెడ్డినగర్ వంటి ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తూ వ్యాపారులు, కొంటూ విద్యార్థులు పట్టుబడ్డారు.
![Students]](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2024/07/Students-6.jpg)
డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వాడుతూ పట్టుబడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసుశాఖ సిద్ధమైంది. డ్రగ్స్ వాడుతూ దొరికిన విద్యా ర్థులను కళాశాలల నుంచి ఇంటికి పంపేలా టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పట్టుబడిన విద్యార్థులపై నార్కోటిక్ అధికారులు చర్యల నిమిత్తం టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులను కోరినట్లు సమాచారం. డ్రగ్స్ మహమ్మారిని త్వరగా కట్టడి చేయాలని.. పట్టుబడిన విద్యార్థులను ఉపేక్షిస్తే ఈ సంస్కృతి మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రిసార్ట్స్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇంజినీరింగ్ విద్యార్థులు రిసార్ట్స్‌లను అద్దెకు తీసుకుని సహచర విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఈ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో సుమారు వంద వరకు రిసార్ట్స్ ఉండగా…ఈ రిసార్టుల్లో ప్రతిరోజూ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులే ఎక్కువగా వేడుకలు చేసుకుంటున్నారని సమాచారం.
ఇక నుంచి ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులు డ్రగ్స్ వాడుతూ..పట్టుబడితే ఇంటికే పంపిస్తాం. ఈ మేరకు ఎస్వోటీ, నార్కోటిక్, సివిల్, డ్రగ్స్ పోలీసులతో కలిసి ఏర్పాటైన ప్రత్యేక బృందాలు కళాశాలల విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారిస్తాయి. ఇప్పటికే డ్రగ్స్ వాడుతూ..పట్టుబడిన పలువురు విద్యార్థులపై నార్కోటిక్ పోలీసులు ఉన్నత విద్యామండలికి లేఖలు రాశారు. మత్తు పదార్థాల సమూల నిర్మూలనకు నిరంతర నిఘా పెడుతాం.
-కేవీపీ రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం