ముంబై, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 3 రోజులపాటు లాభాల్లో కదలాడిన సూచీలు.. గురువారం భారీగా పతనమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,236.11 పాయింట్లు లేదా 1.48 శాతం క్షీణించి 82,498.14 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 1,470.05 పాయింట్లు కోల్పోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 365 పాయింట్లు లేదా 1.41 శాతం దిగజారి 25,454.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రా-డేలో 430.60 పాయింట్లు పడిపోయింది.
హెవీ వెయిట్ ఇండెక్స్‌లైన సెన్సెక్స్, నిఫ్టీలలో మెజారిటీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌లో ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎటర్నల్, పవర్‌గ్రిడ్ షేర్లు నిరాశపర్చాయి. అమెరికా, ఇరాన్ నడుమ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. బ్రెంట్ ముడి చమురు ధరను ఏడాది గరిష్ఠానికి ఎగదోశాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి మూతబడితే.. ద్రవ్యోల్బణం విజృంభిస్తుందన్న ఆందోళనలూ మార్కెట్‌ను దెబ్బతీశాయన్నారు.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. మదుపరుల సంపదను ఒక్కసారిగా కరిగించేశాయి. గురువారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.6,79,210.10 కోట్లు హరించుకుపోయింది. ఫలితంగా రూ.4,65,22,014.57 కోట్ల (5.13 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. ఎక్సేంజీలోని 2,927 స్టాక్స్ నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.71 శాతం, స్మాల్‌క్యాప్ 0.98 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. రంగాలవారీగా రియల్టీ షేర్లు అత్యధికంగా 2.54 శాతం క్షీణించాయి. ఆ తర్వాత విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్ షేర్లున్నాయి. ఆసియా మార్కెట్ల విషయానికొస్తే.. దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగియగా.. హాంకాంగ్, చైనా సూచీలకు సెలవు.