Chevella | చేవెళ్ల రూరల్, మార్చి 21 : వేసవి కాలం రావడం.. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. కొన్ని చోట్ల రెండు రోజులకు ఒకసారి, మరి కొన్ని చోట్ల రోజు విడిచి రోజు అది నాలుగైదు బిందెలు రావడంతో ప్రజల పడుతున్న కష్టాలు అంతాఇంతా కావనే చెప్పాలి.
చేవెళ్ల నియోజకవర్గ పరిధి శంకర్పల్లి మున్సిపల్ రెండో వార్డులోని గణేష్‌నగర్ బుడగజంగం కాలనీలో గత సంవత్సరం కాలం నుంచి సరిపడా నల్లాలు, నీరు లేక తీవ్రంగా కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడగజంగం కాలనీలో దాదాపు 200 మంది ప్రజలు నివాసముంటున్నారు. కాలనీ మొత్తం 5 నల్లాలు మాత్రమే ఉన్నాయని, ఒక 20 ఇండ్లకు మాత్రం ఒకటే నల్లా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కుటుంబాలకు ఒక నల్లా సరిపోవడం లేదని, పలుమార్లు నీరు పట్టుకుంటున్న క్రమంలో గొడవలు సైతం జరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రెండు రోజులకు ఒక సారి నీరు సరఫరా అవుతున్నా అవి సరిపోవడం లేదని, చెరో నాలుగు బిందెలు పట్టుకొని సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు..
నీటి ఎద్దడి, నల్లాల పునరుద్ధరణపై పలు మార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పరిష్కరిస్తామని చెప్పి దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.