తాండూరు, మార్చి 25 : తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగు నీటి సమస్యలు ప్రజలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. జలసంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటి నిల్వ సామర్థాన్ని పెంచుకోని ఫలితంగా కాంగ్రెస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో ఎండకాలం ప్రారంభంలోనే కరువు ఛాయలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో ఇందుకు భిన్నంగా ఉండేది.
బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా తాగు, సాగునీరు అందుబాటులో ఉండేది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామం కూడా కరువు పీడిత ప్రాంతంగా ఉండేది కాదు. మండుటెండల్లో సైతం తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉండేది. నేడు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధుల్లో నిత్యం ఏదోఒక చోట నీటి సమస్య వస్తున్నది. ఇక పంట సాగుకు నీటి సమస్యలు అనేకంగా ఉండడంతో చేతికొస్తున్న పంట ఎండిపోతున్నది.
తాండూరు మున్సిపల్లో 36 వార్డులు, 13,214 నివాస గృహాలు, 80 వేలకు పైగా జనాభా, 9 వేలకు పైగా మంచి నీటి నల్లాలు ఉన్నాయి. ప్రజలు తాగేందుకు నిత్యం 8.5 ఎం.ఎల్.డి నీరు కావాలి. కానీ ప్రస్తుతం 6.5 ఎం.ఎల్.డి నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. ఇంకా 2.0కు పైగా ఎం.ఎల్.డి నీటి కొరత ఉన్నట్లు సమాచారం. ఇందుకు పాలకులు, అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తున్నది. తాండూరు పట్టణానికి కిలోమీటర్ సమీపంలోనే కాగ్నానది ఉన్నది.
ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా రూ. కోట్ల నిధులతో రెండు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా తాండూరుకు సమృద్ధిగా నీళ్లు అందేవి. ప్రస్తుతం ఈ పంప్‌హౌస్‌లు పాడై మరమ్మతులకు నోచుకోలేకపోవడంతో తాండూరులో నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో కాలనీల్లో ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో అశాస్త్రీయంగా శుద్ధి చేసిన నీటిని ప్రజలు కొనుగోలు చేసి తాగుతున్నారు.
ఇందుకు ప్రతినెల చిన్న కుటుంబానికి రూ.600 నుంచి రూ.800 అవుతున్నాయి. పెద్ద కుటుంబాలకు నెలకు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. పంప్‌హౌస్‌లో నీటిని తోడే మిషన్లు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో పాటు రాజస్థాన్, అహ్మదాబాద్‌ల నుంచి తీసుకురావాల్సింది ఉందని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని శాసన సభలో ఇటీవల తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సీఎంను కూడా కోరారు.
బీఆర్ఎస్ పాలనలో తాండూరు కాగ్నానది, యాలాల కాక్రవేణి నదిలో నీటి నిల్వకోసం కోట్ల నిధులతో చెక్ డ్యాంలను నిర్మించారు. కాగ్నానదిలో నీరున్నప్పటికీ కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో పంప్‌హౌస్‌కు, పాడైన పైపులకు మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు రావడంతోపాటు మిషన్ భగీరథ కనెక్షన్ లేని కాలనీల్లో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు.
సిద్దన్నమడుగుతండాలో నీటి ఎద్దడి
పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగుతండాలో కూడా మంచినీటి సమస్యలు తలెత్తుతున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం పనులతో పైప్లైన్లు పోవడంతో వాటికి సకాలంలో పాలకులు, అధికారులు మరమ్మతులు చేయించకపోవడంతో నీళ్లు రావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా నిత్యావసర పనులకు, తాగేందుకు నీళ్లను పట్టుకుంటున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఇలా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఏదో ఒక చోట నిత్యం మంచినీళ్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇందుకు కాంగ్రెస్ సర్కార్ వేసవి చర్యలు చేపట్టకపోవడమే కారణమని స్పష్టంగా తెలుస్తున్నది. పశువులకు కూడా నీటి సమస్యలు తప్పడంలేదు. బీఆర్ఎస్ పాలనలో పశువులు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి కుండీల్లో కూడ నీరు కనిపిస్తలేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.