Shankarpally Market | చేవెళ్ల రూరల్, మే 4 : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో ఆదివారం డ్రైనేజీ పైప్ లైన్ లీక్ అవ్వడంతో మురుగు నీరు పొంగిపొర్లింది. ఆ డ్రైనేజీ పైపులైన్లకు, సులభ్ కాంప్లెక్స్ నీరు తోడవ్వడంతో మార్కెట్కు వెళ్లే ప్రజలు, అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడ్డారు.
గత పది రోజుల్లో మూడు సార్లు ఈ పరిస్థితి దాపురించడం పరిపాటిగా మారడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.