యాచారం, ఏప్రిల్ 29 : మండలంలోని నానక్‌నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైనది. అధికారుల నిర్లక్ష్యంతో మురుగుకాల్వలు ఇండ్ల మద్య నుండి పొంగి పొర్లుతూ ఏరులై పారుతున్నది. భూగర్భ డ్రైనేజీలు నిండి సీసీ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్నది. దీంతో ముక్కుపుటలదిరేలా దుర్గంధం వెదజల్లుతున్నది. ఇళ్ల మధ్యనే మురుగుకంపు కొడుతుండటంతో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటంతోనే మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచి మురికి కూపాలుగా మారుతున్నవి. మురుగునీటిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈగలు, దోమలు విజృంభించి, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రాత్రిపూట దోమలు ప్రజలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికే కొంత మంది అనారోగ్యం పాలవుతున్నారు. ప్రత్యేక పాలనలో నిర్వాహణ లోపంతో పారిశుద్ధ్యం ఎంతో అధ్వన్నంగా తయారైనది. నూతనంగా భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించటమే తప్ప అధ్వాన్నంగా ఉన్న వాటిపై దృష్టి సారించటంపై అధికారులు విఫలమవుతున్నారు. మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవటంతో ఇళ్ల మధ్యనే మురుగునీరు ఏరులై పారుతుంది. పేరుకుపోయిన మురుగు రసాయన జ్వాలాను తలపిస్తుండటంతో ప్రజలు నిత్యం తలలు పట్టుకుంటున్నారు. మురుగుకాల్వలు తీసేనాథుడే లేకపోవటంతో పారిశుద్ధ్యం సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. అయినప్పటికి అధికారులలో ఎలాంటి కదలికలు లేకపోవటం గమనార్హం. పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు దృష్టి సారించి, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేసి, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ పెద్దయ్య కోరుతున్నాడు.