ధారూరు, జూన్ 10: మరియా ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని దోర్నాల్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ శివారులోని సర్వే నం.113లో గల మరియా ఫీడ్ కంపెనీకి చెందిన పశు వ్యర్థాల లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. రెండు మూడు రోజుల నుంచి చుట్టుపక్కల ప్రాంత రైతులకు వాసన రావడంతో అధికారులకు సమాచారం చేరవేశారు. గ్రామస్తులు సోమవారం రాత్రి పశు కళేబరాలతో వెళుతున్న లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం దోర్నాల గ్రామంలో ప్రజలు భారీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ సాజిదావేగం, సీఐ రఘురాం, ఎస్సై అనిత సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
రెండు, మూడు రోజులుగా ఫ్యాక్టరీ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అస్వస్థతతోపాటు వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో పశు వ్యర్థాల వాహనాలను గ్రామంలోకి తీసుకువచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని శాశ్వతంగా నిలిపివేయాల డిమాండ్ చేశారు. 2016లో కోళ్ల దాణా పేరుపై పర్మిషన్ తీసుకుని పశు కళేబరాలతో నూనెకు సంబంధించిన పదార్థాలు తయారుచేస్తున్నారు. ఎన్నోసార్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ధర్నాలు, ఆందోళన చేసినా నామమాత్రంగా మూసివేసి మళ్లీ తిరిగి ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరియా ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్లు వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర తెలిపారు.