చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 8 : చేవెళ్ల మున్సిపల్ వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటో వార్డు నుంచి 11వ వార్డుల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం 6 గంటల నుంచే ప్రజల వద్దకు వెళ్లి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. రేవంత్ సర్కార్ వైఫల్యాలను వివరిస్తూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఊరెళ్ల, ఇబ్రహీంపల్లి, మల్కాపూర్, పల్గుట్ట, కందవాడ, మల్లారెడ్డిగూడ, నారాయణ్దాస్గూడ, పామెన, దామరగిద్ద, రామన్నగూడ వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. మీలో ఒకరినై.. వెన్నంటే ఉంటూ.. సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా ముందుకు సాగుతూ వార్డును అభివృద్ధి పథంలో పయణించేలా కృషి చేస్తామని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రామన్నగూడలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్ అభ్యర్థి పెద్దొళ్ల గోపాల్ తరఫున ప్రచారం చేశారు. దామరగిద్ద వార్డులో అభ్యర్థి బేగరి అనిల్‌కుమార్ తరఫున డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ బార్లపల్లి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు వనం మహేందర్‌రెడ్డి, పట్లోళ్ల హన్మంత్ ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూత మల్లేశ్, డప్పు సువర్ణ చందు, బస్త్తేపురం మాధురిశ్రీశైలం, శేరి పావని శివారెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్ రెడ్డి, కావలి లక్ష్మీరవీందర్యాదవ్, కుర్వ మంగమ్మ మల్లేష్, చాకలి గూడెం పాండు, బేగరి అనిల్ కుమార్, పెద్ద్దొళ్ల గోపాల్, మహ్మద్ జాహెద్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీ జెట్ స్పీడ్‌తో దూ సుకెళ్తోంది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ కారు గుర్తు అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపిస్తామని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పటేలా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు. మున్సిపాలిటీలోని 28వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు తమదైన శైలితో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రధాన ఆయుధంగా మలుచుకుని, నాటి కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు అమలు తీరు, పట్టణాభివృద్ధి తదితర అంశాలను ప్రజల వద్ద ప్రస్తామిస్తూ ఓట్లు అడుగుతున్న తీరు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును సూచిస్తుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కాలనీల్లో పార్టీ క్యాడర్ అం తగా లేకపోవడం తదితర అంశాలతో కాం గ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వెనుకబడిపోయిందని, ప్రధాన నాయకులు సైతం గెలుపోవటములను అంచనా వేయలేకపోతున్నారని స్థా నిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై వారం గడుస్తున్నా పలు వార్డుల్లో కాలనీలపై కాంగ్రెస్ నేతలు పట్టు సాధించలేదని, ఓటర్లను అకట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారని పలువురు బహిరంగానే చర్చించుకుంటున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు, నియోజకవర్గ ప్రధాన నేతలు వార్డుల వారీగా విడిపోయి ప్రచార పూర్వంలో తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో వివరిస్తూ ఓట్లను అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రచారం తీరును విశ్లేసిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మరోమారు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. ఇబ్రహీంపట్నం, శేరిగూడ, సీతరాంపేట గ్రామాల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించేందుకు నియమించిన ఇన్చార్జిలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు భవిష్యత్తుల్లో చేపట్టే వాటిని వివరిస్తున్నారు.
చేవెళ్లటౌన్ : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఒక్క అవకాశం కల్పిస్తే అంకితభావంతో పని చేసి వార్డుల ప్రగతి వెలుగుల వైపు నడిపిస్తారని చేవెళ్ల మాజీ ఎంపీపీలు మల్గారి విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ తెలిపారు. చేవెళ్ల మున్సిపల్లోని అన్ని వార్డుల్లో ఆదివారం ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. 14, 18, 16, 12, 17, 11వ వార్డుల అభ్యర్థులు తలారి యాదయ్య, దండులతసత్యం, మిట్టి లతవేంకటరంగారెడ్డి, అనంద్, జాహీద్, నవనిత మల్లారెడ్డి గెలుపుకోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బ్యాగరి నర్సింహులు, నాయకులు పెంజర్ల అనంతరెడ్డి, గుడిపల్లి శేఖర్ రెడ్డి, కనక మామిడి మల్లారెడ్డి, రఘుపతి రెడ్డి, మాణిక్య రెడ్డి, నత్తి మల్లా రెడ్డి, మహేందర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని పుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం 15వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాపిశెట్టి రామకృష్ణకు మద్దతుగా గోలి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కేశంపేట : షాద్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేశంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పట్టణంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఈశ్వర్రాజుకు మద్దతుగా అయ్యప్పకాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలు నట్టేట మునుగుతారని, మున్సిపాలిటీలో ప్రగతిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కేశంపేట మండల యువ నాయకుడు ప్రేమ్‌కుమార్‌గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేస్తేనే బతుకులు బాగుపడతాయి..
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : అమ్మా.. కారు గుర్తుకు ఓటేస్తేనే మళ్లీ మన బతుకులు బాగుపడతాయి.. సీమాంధ్ర పాలకుల చెర నుంచి పదేండ్లు సంతోషంగా ఉన్న తెలంగాణ ప్రజలకు మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పడి కష్టాలు మోసుకొచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 2వ వార్డులో బీఆర్ఎస కౌన్సిలర్ అభ్యర్థి హిదాయత్అలీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి ప్రచారంలో ఓ పెద్దమ్మ ఎదురై అయ్యా కారు గుర్తు కేసీఆర్ సారు ఉన్నప్పుడే అందరం సంతోషంగా బతికినం బిడ్డా… మల్లా యమినోని లేక గెలిచిన కాంగ్రెసోని హయాంలో ఇబ్బందులు పడుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంది. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలననే పెద్దమ్మ అందరం కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో కేసీఆర్ పాలనను తెచ్చుకుందామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు ఏర్పడిన రెండేండ్ల్లకే కష్టాలు మొదలై ప్రజలంతా కాంగ్రెస్‌ను చీదరించుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్న ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు ఓటువేస్తే కస్టాల పాలవుతామని గమనించి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులోని ముస్లిం, మైనార్టీలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.