షాద్‌నగర్, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీని అర్హత కలిగిన ప్రతి రైతుకూ వర్తింపచేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అర్హులకు రుణమాఫీ రాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధిత రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తెస్తే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారని చెప్పారు. సోమవారం షాద్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సందేహాలపై తక్షణమే స్పందించి తగిన సలహాలు, సూచనలు చేయాలని చెప్పారు. సాంకేతిక కారణాలతో పలువురికి రైతు రుణమాఫీ జాబితాల్లో పేర్లు రాలేదని, అంతమాత్రాన ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే రైతులు నేరుగా తమ దృష్టికి తేవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రాజారత్నం, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హైడ్రాను షాద్‌నగర్‌కు వర్తింపజేయండి
చెరువులు, కుంటలు, కాలువల సంరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీలో చేపట్టిన హైడ్రా చర్యలు హర్షదాయకమని, హైడ్రాను షాద్‌నగర్ ప్రాంతానికి కూడా వర్తింపజేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. హైడ్రా అనుసరిస్తున్న తీరును సామన్య ప్రజలు స్వాగతిస్తున్నారని, భవిష్యత్ తరాలకు సహజ సంపదను అందజేయాలంటే ఈ తరహా చర్యలు అవసరమన్నారు.
షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో హైడ్రాను పూర్తిస్థాయిలో అమలుచేస్తే చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావని, భూగర్భ జలాలు సైతం పెరుగుతాయన్నారు. అన్నిటికి మించి ప్రభుత్వ భూములకు రక్షణ లభిస్తుందని చెప్పారు. కొన్ని రోజులుగా హైడ్రా చేపట్టిన చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని, చెరువులను కబ్జా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టే రోజులు వచ్చాయన్నారు. పర్యావరణ విధ్వంసం మంచిది కాదని, అన్ని వర్గాల ప్రజలు హైడ్రా చర్యలను స్వాగతించాలని కోరారు.