కులకచర్ల, సెప్టెంబర్ 6 : ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి.. అనంతరం గ్రామంలో సర్వేనంబర్ 709, 06లో ఉన్న సరిహద్దు భూ సమస్య అంశాన్ని స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.
అక్కడి నుంచి చౌడాపూర్ మండలం లింగంపల్లి గ్రామంలోని మ్యాకలోని చెరువు కట్టకు కొందరు గండి కొట్టారని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన స్వయంగా అక్కడికెళ్లి పరిశీలించారు. తమకు ఇబ్బంది కలుగుతున్నదని కొందరు చెరువుకట్టను తొల గించేందుకు యత్నించిన విషయాన్ని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఏదైనా సమస్య ఉంటే గ్రామస్తులందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని.. చెరువులు, కుంటలు ప్రభుత్వ వనరులని వాటికి నష్టం కలిగిస్తే సంబంధిత వ్యక్తు లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1952లోనే చెరువుకట్ట ఉన్నట్లు నక్షలో ఉందన్నారు. దానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో చెరువుకట్టకు సంబంధించిన సర్వేను పూర్తి చేసి నివేదికను అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈవో హబీబ్అహ్మద్, తహసీల్దార్ మురళీధర్, అధికారులు, రైతులు ఉన్నారు.