రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధిత రైతాంగం పోరుకు సిద్ధమైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు చలో ప్రజాభవన్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు. వీరి పోరుకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలికి గురువారం ప్రజా భవన్కు వెళ్లేందుకు బయలు దేరారు. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను నిర్బంధించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట, కొందుర్గు, చౌదరిగూడ మండల కేంద్రాలు, కొత్తూరు, షాద్నగర్, నందిగామ, ఆమనగల్లు, చేవెళ్లలలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని పరిగిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టుల పరంపర కొనసాగింది. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ను నిలదీయడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం సరైంది కాదని వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)
వానకాలం ముగుస్తున్నది. రైతు భరోసా ఊసే లేదు. పంట రుణాలు సైతం చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. ప్రభుత్వం చేపట్టిన సర్వే ఇంకా కొనసా..గుతున్నది. దీంతో రుణమాఫీకి ఇంకెంత కాలం వేచి చూడాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది.
మూడు విడుతల్లో కలిసి జిల్లాలో 87,612 మందికి రూ.660.72కోట్లను మాఫీ చేసింది. రుణమాఫీ కాని రైతుల్లో చాలామందికి రేషన్ కార్డులేక మాఫీ కాలేదు. ఈ మేరకు బాధిత రైతుల నుంచి అధికారులకు 17,926 దరఖాస్తులు రాగా.. ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతూనే ఉన్నది. కేవలం కుటుంబ నిర్ధారణకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆధార్ మిస్ మ్యాచింగ్, ఇతరత్రా పొరపాట్లు ఉన్నవి బ్యాంకులు చూసుకుంటాయని చెబుతున్నారు. దీంతో రైతులు మళ్లీ వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా.. రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ లోటుపాట్లు వేలాది మంది రైతుల పాలిట శాపంగా మారాయి. రుణమాఫీ అయిన తర్వాతే కొత్త రుణాలు ఇస్తామంటూ బ్యాంకర్లు స్పష్టం చేస్తుండడంతో పంటల సాగుకు డబ్బుల్లేక జిల్లా రైతాంగం గోస పడుతున్నది. ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం మాటతప్పగా.. ఇదేమిటని ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలకు పూనుకోవడం ఎంతవరకు సబబు అని ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రశ్నిస్తున్నది.