వికారాబాద్, జూన్ 6, (నమస్తే తెలంగాణ) ; ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను దేశంలోనే ఎక్కడాలేని విధంగా అమలు చేసింది. ఎన్నో సంక్షేమ పథకాలు, పింఛన్ల పెంపు, పెట్టుబడి సాయం పెంపు తదితర సాధ్యంకాని హామీలనిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించి ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా పూర్తిగా అమల్లోకి తీసుకురాకపోవడం గమనార్హం. కొత్త పథకాలు దేవుడెరుగు.. ఉన్న పథకాలను అమలుచేయకపోవడం సిగ్గుచేటు. ప్రధానంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ అటకెక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గతేడాది నుంచి న్యూట్రిషన్ కిట్స్ పథకానికి గ్రహణం పట్టింది. మరోవైపు గర్భిణులు, శిశువులకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్స్ పథకాన్ని ఎంసీహెచ్ కిట్స్గా పేరు మార్చినప్పటికీ పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే గర్బిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన న్యూట్రిషన్ కిట్స్ సరఫరా గతేడాదిగా పూర్తిగా నిలిచిపోయింది. న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని నిలిపివేయడంతో జిల్లాలో గతేడాదిగా సుమారు 9 వేల మంది గర్భిణులకు సుమారు 18 వేల న్యూట్రిషన్ కిట్స్ అందలేదు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ఐదో నెల, తొమ్మిదో నెలలో రెండు సార్లు రూ.2 వేల విలువ చేసే పోషకాహారాలతో కూడిన కిట్లను కేసీఆర్ ప్రభుత్వం గర్బిణులకు అందజేసింది. కిట్‌లో రెండు కిలోల న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్‌తోపాటు కిలో ఖర్జూర, 500 గ్రాముల నెయ్యి, ఐరన్ సిరప్ రెండు బాటిళ్లు, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు తదితర వస్తువులుండేవి. గతేడాదిగా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ నిలిచిపోవడంతో పుట్టిన బిడ్డల్లో పోషకాహార లోపం సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఆగిన కేసీఆర్ కిట్స్ పంపిణీ, అందని ఆర్థిక సాయం
గర్భిణులు, పుట్టబోయే శిశువుల సంరక్షణతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్ కిట్స్ పథకం నిలిచిపోయింది. గత ఏడాదిన్నరగా కేసీఆర్ కిట్లతోపాటు అమ్మఒడి కింద ఇచ్చే ఆర్థిక సాయం పాప పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలు కూడా అందడంలేదు. కేసీఆర్ కిట్స్‌ను ఎంసీహెచ్ కిట్స్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి మంగళం పాడింది. దీంతో ప్రభుత్వాసుపత్రులో ప్రసవాల సంఖ్య తగ్గిపోయింది. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో అర్హులైన 37,176 మందికి కేసీఆర్ కిట్స్‌ను పంపిణీ చేయగా, అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందజేసింది.