సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రతి రోజూ సుమారు 2వేల నుంచి 3వేలకు పైగా ఓపీ రోగులకు, 2000మంది రోగులకు ఐపీ సేవలు అందించే గాంధీ దవాఖానకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధికారిని సూపరింటెండెంట్‌గా నియమించడం ఇప్పటి వరకు కొనసాగిన ఆనవాయితీ. కానీ ఇటీవల జరిగిన బదిలీల అనంతరం గాంధీ దవాఖానకు సూపరింటెండెంట్‌గా నియమించిన వైద్యాధికారి ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అర్హులు కాదనే వాదన వినిపిస్తోంది. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సదరు వైద్యాధికారిని అర్హత లేకున్నా కొందరి పెద్ద సిఫారసు మేరకు నిత్యం వేల సంఖ్యలో రోగులు చికిత్స పొందే గాంధీ దవాఖానకు సూపరింటెండెంట్‌గా నియమించడంపై పలువురు వైద్యులు, అధికారులు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి…?
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)నిబంధనల ప్రకారం టీచింగ్ హాస్పిటల్‌కు సూపరింటెండెంట్‌గా నియమించాలంటే వారు క్లినికల్ ఓరియంటేషన్ కలిగి ఉండాలి. అంటే రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో అనుభవం కలిగిన వారై ఉండాలి. దీంతో పాటు అదనపు డీఎంఈ హోదా కలిగి ఉండాలి. ప్రస్తుత సూపరింటెండెంట్ ఫిజియాలజీ చేశారు. ఫిజియాలజీ వారికి క్లినికల్ ఓరియంటేషన్ ఉండదు. అంటే వారు మెడికల్ ప్రాక్టీస్ చేసి ఉండరు. కేవలం బోధనకు మాత్రమే పరిమితమవుతారు.
సాధారణంగా అదనపు డీఎంఈ హోదాతో పాటు క్లినికల్ ఓరియంటేషన్ కలిగి ఉన్న వారు టీచింగ్ హాస్పిటల్స్‌కు సూపరింటెండెంట్లుగాను, ఇతర అన్ని రకాల హోదాలకు అర్హులు. ఫిజియాలజీ వంటి నాన్ క్లినికల్‌కు చెందిన వారు అదనపు డీఎంఈ హోదా కలిగి ఉన్నప్పటికీ బోధన, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హోదాకు అర్హులవుతారు. కానీ ప్రస్తుతం గాంధీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారి అదనపు డీఎంఈ హోదా కలిగి ఉన్నప్పటికీ క్లినికల్ ఓరియంటేషన్ లేదని, అంత పెద్ద స్పెషాలిటీ దవాఖానకు ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా సూపరింటెండెంట్‌ను చట్టం ప్రకారం నియమించారని పలువురు సిబ్బంది చెబుతున్నారు.
అంతా తానై…
క్లినికల్ పరంగా ఎలాంటి అనుభవం లేకపోవడంతోనే గాంధీ దవాఖాన నిర్వహణ గాడితప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ దవాఖానలో రోగులకు సరైన వైద్యం, మందులు అందడం లేదని, పరిపాలనా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ఇప్పటికే అనేక సార్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో పాటు డీఎంఈ స్థాయి అధికారులు సైతం దవాఖానను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీనియర్ ఆర్ఎంవోనే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తున్నది.
గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రస్తుతం సూపరింటెండెంట్‌కు అన్నీ తానై దగ్గరుండి పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా అంతిమంగా రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, నిత్యం వేల సంఖ్యలో రోగులు చికిత్స పొందే గాంధీ దవాఖాన వంటి పెద్ద దవాఖానలకు అర్హులైన, అనుభవజ్ఞులైన అధికారులను నియమిస్తే అటు రోగులకు, ఇటు వైద్యసిబ్బందికి మేలు జరుగుతుందని పలువురు వైద్య సిబ్బంది, రోగులు అభిప్రాయపడుతున్నారు.