ఇబ్రహీంపట్నం, జనవరి 10 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ పరిధిలో స్పెషల్ బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. రంగారెడ్డి రీజినల్ పరిధిలో ఎక్కువగా నగరశివారు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ర్టాలకు చెందినవారు ఎక్కువమంది నివసిస్తున్నారు. వీరంతా సంక్రాంతికి తమ ఊర్లకు వెళ్లనున్నారు. వారి అవసరాలను బట్టి ఆర్టీసీ బస్సులను నడపాలని భావిస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని శివారు ప్రాంతాల ఆర్టీసీ డిపోల మేనేజర్లు ఎక్కడెక్కడ అదనపు బస్సులు నడుపాలనేదానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టికెట్లు రిజర్వేషన్ల ఆధారంగా ఆయాప్రాంతాల నుంచి అదనపు బస్సులను నడిపించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో చార్జీలమోత నేపథ్యంలో సామాన్యులకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టీసీ ప్రయాణాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు కూడా వసూళ్లు చేయకుండా పలు రాయితీలను కూడా కల్పిస్తున్నది.
30మంది ప్రయాణికులు ఒకేచోటు నుంచి రిజర్వేషన్లు చేయించుకున్నట్లయితే ఆ ప్రాంతానికి స్పెషల్బస్సులు కూడా ఏర్పాటుచేసి ఉన్నచోటు నుంచి వారు వెళ్లే ప్రాంతాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు రంగారెడ్డి రీజినల్ పరిధిలో 8డిపోలు ఉన్నాయి. ఈ డిపోలన్నీ నగరశివారు ప్రాంతాలైన హయత్‌నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మిధాని, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల పరిధిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు అత్యధికంగా నివసిస్తున్నారు. అలాగే, నల్గొండ, మహబూబ్‌నగర్, యాదాద్రిభువనగిరి, వరంగల్ తదితర జిల్లాలకు కూడా ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించారు. ఈ రీజినల్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు అదనంగా మరో 285అదనపు బస్సులు నడపాలని నిర్ణయించారు. జేబీఎస్‌తో పాటు ఈ డిపోల నుంచి కూడా రిజర్వేషన్ల రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు బస్సులు నడిపించేందుకు గానూ డిపో మేనేజర్లు రూట్‌మ్యాప్‌లను కూడా సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం నుంచి బస్సులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే, పండుగ తర్వాత కూడా రిజర్వేషన్లు ఉన్నవారిని ఆయా ప్రాంతాల నుంచి తిరిగి నగరానికి తీసుకురావటానికి కూడా అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లివచ్చేందుకు (అప్ అన్‌డౌన్)రిజర్వేషన్లు చేయించుకున్నవారికి తిరిగి వచ్చే టికెట్లో పదిశాతం డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించటంతో పాటు పలు రాయితీలను కూడా ప్రకటించారు. ప్రైవేటు బస్సుల్లో పండుగ సందర్భంగా టికెట్లను విపరీతంగా పెంచారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సామాన్యులకు సైతం తక్కువ చార్జీలతో కూడిన మంచి రవాణా సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ నిర్దేశించిన పాయింట్ల వద్ద ఒక్క ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. నగరశివారుల్లోని బీఎన్‌రెడ్డి, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, బొంగుళూరు వంటి ప్రాంతాలను ప్రత్యేక పాయింట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఆర్టీసీ నుంచి ఒక అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువమంది ఏ ప్రాంతాలకు వెళుతున్నారో తెలుసుకుని వారికి అనుకూలంగా స్పెషల్బస్సులు నడుపటానికి నిర్ణయించారు. పండుగ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండనున్నారు. అలాగే, 30మంది ఒక్కచోట ఉండి ఒకే ప్రాంతానికి వెళ్లాల్సిన వారైతే వారికి అప్అన్డౌన్ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎక్కువమంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లాలని కోరుకున్న వెంటనే బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లటానికి రీజినల్ పరిధిలో మొత్తం 285ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటానికి ముందుకువచ్చి రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు కూడా పదిశాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
– శ్రీధర్ , రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్