ఆదిబట్ల, జూలై 17: నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేషన్ కార్డు కలిగిన ప్రతి నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లాలో 78,789 మంది దరఖాస్తులు..
రాజీవ్ యువ వికాసం పథకానికి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 27,828 యూనిట్లు లక్ష్యం కాగా జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 78,789 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. దీంతోపాటుగా అధికారులు దరఖాస్తుదారులకు సంబంధిత బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వూలు సైతం నిర్వహించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని గత నెల జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ నేటికీ పథకం అమలుకు నోచుకోలేదు. నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా..? లేదా అని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది. తాము పెట్టుకున్న యూనిట్లు తమకు వస్తాయా అనే ఆశతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 27,828 యూనిట్ల లక్ష్యానికి ఏకంగా 78,789 యూనిట్ల కోసం దరఖాస్తులు రావడంతో మండల స్థాయిలో ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు.
కొలిక్కిరాని జాబితాలు..
రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి మండల స్థాయిలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. జాబితాలను జిల్లా స్థాయికి పంపిస్తే.. అక్కడ బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. కానీ మండల లెవెల్ కమిటీలు తుది జాబితాలను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమిటీలో ఎంపీడీవో, మండల స్థాయి డీఆర్డీఓ సిబ్బంది, బ్యాంక్ అధికారులు ఉండగా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళ కారణంగానే ఇంకా తుది జాబితాలు సిద్ధం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో జాబితాలు ఎప్పుడు పూర్తవుతాయి..? మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది..
రాజు యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఆర్డీఏపీడీ శ్రీలత అన్నారు.. ఇంకా తుది జాబితా కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం. ప్రభుత్వం ఆదేశాను కోసం ఎదురు చూస్తున్నాం…
కటింగ్ షాప్ కోసం దరఖాస్తు చేసుకున్న..
రాజీవ్ యు వికాసం పథకంలో కులవృత్తి కావడంతో కటింగ్ షాప్ కోసం దరఖాస్తు చేసుకున్నానని యాచారం మండలం మొండి గౌరెల్లికి చెందిన దేవరకొండ మహేష్ అనే యువకుడు చెప్పారు. జూన్ 2 నుంచి రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికీ ఇవ్వలేదు ఎవర్ని అడిగిన వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాలు అందచేయాలన్నారు.
ప్రభుత్వం హామీకి కట్టుబడి ఉండాలి..
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి రుణాలు మంజూరు చేయాలి. నిరుద్యోగ యువకులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.