వికారాబాద్, సెప్టెంబర్ 30, (నమస్తే తెలంగాణ): జిల్లాలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమనిస్తున్నది. గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన రోహిత్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం తో నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలే వీస్తుండడం గమనార్హం. 60 ఏండ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని ఆ పార్టీ నాయకులు.. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు అమలు సాధ్యం కాని కొత్త పథకాలను ప్రకటించి ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేవలం తొమ్మిదేండ్లలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన వికారాబాద్ జిల్లా ఏర్పాటుతోపాటు త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరందించేందుకు చర్యలు వేగవంతం చేయడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల ఏర్పాటు తదితర కనీవినీ ఎరుగని అభివృద్ధితో జిల్లా ప్రజలు అభివృద్ధివైపే నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని, పథకాలను చేపట్టిన మధ్యవర్తుల ప్రమేయంతో ప్రభుత్వం అందజేసిన దానిలో 10 శాతం కూడా లబ్ధిదారులకు దక్కే పరిస్థితి ఉండేది కాదు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో జిల్లా లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టు విషయంలోనూ, శాటిలైట్ టౌన్షిప్ విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీలకు రూ.లక్ష సాయం, కేసీఆర్ కిట్స్ తదితర పథకాల ఫలాలను మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తూ ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నది. తొమ్మిదేండ్లుగా ప్రజల ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీని తప్పుడు ప్రచారం చేసి బద్నాం చేసే కుట్ర చేస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఎన్నికల్లోనూ ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. సీఎం అభ్యర్థిగా చెప్పించుకుంటున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు మిగ తా తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడడం ఖాయమనే అభిప్రాయం జిల్లాలోని ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్‌కుమార్‌ను ఓడించి మొదటిసారి విజయం సాధించారు. త్వరలో జరుగునున్న అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఆనంద్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రసాద్‌కుమార్ స్థానికేతరుడు కావడంతో జనాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రసాద్‌కుమార్ తల్లిదండ్రులు తాండూరుకు వలస రావడం, తదనంతరం మర్పల్లిలో తన పేరును ఓటరు జాబితాలో చేర్పించి స్థానికుడనంటూ ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ గత ఎన్నికల ముందు ప్రసాద్‌కుమార్‌కు స్థానికేతరుడనే ముద్ర పడిన దృష్ట్యా ఈసారి ఎన్నికల్లోనూ ఓటమి పాలవడం ఖాయమనే తెలుస్తున్నది.
అలాగే గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రసాద్‌కుమార్ వికారాబాద్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలతోపాటు అమాయక ప్రజలపై అట్రాసిటీ కేసులు పెట్టించడంతోపాటు శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు విడుదల చేసిన రూ.174 కోట్ల నిధులు దుర్వినియోగం కావడంలో ప్రసాద్‌కుమార్ పాత్రే ఎక్కువని..కమీషన్లకు ఇబ్బందులు పెట్టడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులను వదిలేసి పారిపోయినట్లు వికారాబాద్ నియోజకవర్గమంతటా జోరుగా ప్రచారం జరుగుతున్నది.
అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ వికారాబాద్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క ప రిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని… మరోవైపు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నెపల్లిలో లింగాయత్ సొసైటీకి చెందిన భూమిని ప్రసాద్‌కుమార్ అనుచరులు కబ్జా చేయడంతోపాటు దౌర్జాన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మె ల్యే ఆనంద్ సహకారంతో సంబంధిత భూమిని కబ్జా చెరల నుంచి తప్పించి లింగాయత్ సొసైటీకి అప్పగించారు. ఇంతా వ్యతిరేకత ఉన్న ప్రసాద్‌కుమార్ రానున్న ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని ఆయా వర్గాల మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధివైపే పరిగి ప్రజలు
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డికి మరోసారి ఓటుతో షాకిచ్చేందుకు పరిగి నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉండి పరిగి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని రామ్మోహన్‌రెడ్డి ఈసారి ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని వినిపిస్తున్నది. అంతేకాకుండా అసాధ్యమని తెలిసి కూడా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి, పైసా పని జరుగకుండానే కాంగ్రెస్ నేతలు కోట్లు కొల్లగొట్టారు. అసాధ్యమని తెలిసి కూడా ప్రాణహితతో పరిగి నియోజకవర్గానికి సాగునీరు వస్తుందని రామ్మోహన్ రెడ్డి అవాస్తవాలను ప్రచారం చేయడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగకుండా అడ్డుకునే కుట్రలోనూ భాగస్వామి అనే ప్రచారం ఆయనపై ఉన్నది.
అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కృషితో పరిగి నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకురావడంతోపాటు కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతిపథంలోకి తీసుకెళ్లారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో పరిగి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధివైపే నిలుస్తూ మరోసారి మహేశ్ రెడ్డినే గెలిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
తాండూరు టికెట్‌పై ఇంకా సందిగ్ధమే..
తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కేటాయింపు విషయంలో ఇంకా సందిగ్ధమే కొనసాగుతున్న ది. ఈ టికెట్ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్సెస్ ఆ పార్టీ సీనియర్ల మధ్య చిచ్చురేపినట్లు జిల్లాలో చర్చ జరుగుతున్నది. దీంతో తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఒక్కో రోజు ఒక్కో పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్లు మల్లు బట్టి విక్రమార్కతోపాటు మరికొందరు కేఎల్ఆర్ (కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) పేరును ఖరారు చేయాలని పట్టుబడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి కొత్త వ్యక్తి పేరు ప్రస్తావిస్తుండడంతో తాండూరు అభ్యర్థి ఎంపిక ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న వ్యక్తితోపాటు కేఎల్ఆర్ కూడా స్థానికేతరులు కావడంతో తాండూరు ప్రజలు వారిని నమ్మే పరిస్థితి ఉండదు. అయితే తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉన్నా తాండూరులో మరోసారి పైలట్ రోహిత్ రెడ్డి విజయం ఖాయమని సబ్బండ వర్ణాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్‌కు మరోసారి షాకిచ్చేందుకు..
కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికల్లోనూ గట్టిగా షాకిచ్చేందుకు కొడంగల్ ప్రజలు సిద్ధమయ్యారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా… కొడంగల్ అభివృద్ధిని విస్మరించిన రేవంత్‌రెడ్డి త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలవడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు చేసిన అనుభవంతోపాటు సీనియర్ నేత అయిన పట్నం నరేందర్‌రెడ్డిని గత ఎన్నికల్లో గెలిపించుకున్న కొడంగల్ ప్రజలు ఈ దఫా ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమయ్యారు. పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చారు.
రేవంత్ నయాపైసా అభివృద్ధి చేయకుండా మాయమాటలు చెబుతూ కొడంగల్ ప్రజలను మోసం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు, భూకబ్జాల వ్యవహారాలు మినహా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనూ, ప్రస్తు తం కూడా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలుకెళ్లొచ్చిన రేవంత్‌రెడ్డి తాజాగా పార్టీ టికెట్ కేటాయించేందుకు రూ. కోట్లు తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అవినీతి, అక్రమార్జన మరకలున్న రేవంత్‌రెడ్డిని ఓడించి చరిత్రలో నిలిచేపోయేలా కొడంగల్ ప్రజలు ఆలోచిస్తున్నట్లు వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్నది.