తాండూరు, నవంబర్ 29 : కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారకులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఏడాదిలోపు ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనమవుతున్నదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగిస్తున్నారన్నారు. విద్యార్థులతో పాటు రైతులు, సామాన్యులకూ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు చేతన్ సింగ్, మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ్‌చారి, భాను ప్రకాశ్, తనూశ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.