వికారాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గత ఆరేడు నెలలుగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి-రాజశేఖర్ మధ్య పొసగడం లేదని సమాచారం. గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమించొద్దని ఆ పార్టీ అధిష్ఠానానికి జిల్లాలో బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించిన వారంతా తెగేసి చెప్పినా..విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి మరీ స్థానికేతరుడైన రాజశేఖర్‌కే ఆ పదవిని ఇప్పించారు. అయితే వింతేమిటంటే జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ నియామకంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ విశ్వేశ్వర్రెడ్డే అతడ్ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాజశేఖర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంపీ చెప్పిన మాటలను అమలుచేయకపోవడం, ఆయన వర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఇరువురి మధ్య విభేదాలు పెరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది.
కాగా, సోమవారం కేంద్రం తగ్గించిన జీఎస్టీకి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టి న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ..లోపలికి జిల్లా అధ్యక్షుడిని రానివ్వకుండా బయటే ఉండాలని మీడియా ఎదుటే చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎంపీ ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లన్నీ చేసిన జిల్లా అధ్యక్షుడిని బయట నిల్చోమనడంపై ఆయన వర్గం నేతలు ఎంపీ కొండాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొండా వర్గం నేతలపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన జిల్లా అధ్యక్షుడు త్వరలో ఎంపీ వ్యవహార తీరునూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.
జిల్లా అధ్యక్షుడితో ఎంపీ కొండాకు విభేదాలు తారస్థాయికి చేరడంతో ఇక అధ్యక్షుడి మార్పు తప్పదని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. రాజశేఖర్‌ను పక్కనబెట్టి తన వర్గానికి చెందిన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా చేసేందుకు ఎంపీ కొండా యత్నిస్తున్నట్లు సమాచారం. రాజశేఖర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని.. విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉండే బీజేపీ బలోపేతం కాకుండా చేస్తున్నారని రాజశేఖర్ వర్గం ఆరోస్తున్నది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయంతో జిల్లాలో పార్టీ పరిస్థితిపై అధిష్ఠానం పెద్దలకు చెప్పేందుకు సీనియర్లు సిద్ధమైనట్లు సమాచారం. విశ్వేశ్వర్‌రెడ్డి మాటలు విని అధ్యక్షుడిని మారుస్తారా.. ? లేదా కొనసాగిస్తారా..? అనేది కొద్ది రోజుల్లో తేలనున్నది.
వికారాబాద్ జిల్లా బీజేపీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి యత్నిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవిలో తాను అనుకున్న వ్యక్తిని నియమించడం మొదలు, అన్నీ తాను అనుకున్నట్లే జరగాలనే ధోరణితో ఉన్నట్లు ప్రచారంలో ఉన్నది. తన మాట కాదంటే పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే స్థానికేతరుడైన రాజశేఖర్‌కు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిం చి మరీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని అప్పగించాడు. కాగా, ఇప్పుడు తన మాట వినడంలేదని పక్కన పెడుతుండడంపై సొంత పార్టీ నేతలే ఎంపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీ కమిటీల నియామకంలో ఎం పీ విశ్వేశ్వర్‌రెడ్డి సూచించిన వారు పేర్లు కాకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కమిటీల్లో జిల్లా అధ్యక్షుడు చోటు కల్పించడంతో ఇరువురి మధ్య వైరం మరింత రాజుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
గతంలోనూ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని జిల్లా కార్యవర్గం ఆహ్వానించింది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సమయమిచ్చిన ఎంపీ కొండా.. తన వర్గం నేత మాట మేరకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాకుండా దోమ వెళ్లేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు మన్నెగూడ వరకు వెళ్లి ఎంపీ కారును అడ్డగించి, మేం అందరం ఎదురుచూస్తుంటే ఎందుకు రావడం లేదం టూ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ కొండా.. తన వర్గం నాయకుడు శ్రీధర్‌రెడ్డి చెబితేనే వస్తానని అనడం.. కార్యకర్తలు మీ కు అవసరం లేదా అంటే నాకు కార్యకర్తలు అవసరం లేదని వ్యాఖ్యానించడం తీవ్ర దుమా రం రేపింది.
కొందరు బీజేపీ నేతలు కార్యాల య ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేరని ఎంపీకి ఫిర్యాదు చేయడంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే ప్రచారమూ జరుగు తు న్నది. చివరకు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ కొండా అందరి ముందే కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదని జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించడంతోపాటు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కొండా పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. షాద్‌నగర్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి, పరిగి సెగ్మెంట్ లో పరమేశ్వర్‌రెడ్డి, తాండూరు సెగ్మెంట్లో రమేశ్‌ను గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని ఆయన పాలిటిక్స్ చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడి వర్గం ప్రచారం చేస్తున్నది.