ఆదిబట్ల, డిసెంబర్ 17 : పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం కొనసాగింది. ధర్నాలో ఓ కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోగా, పోలీసులు దవాఖానకు తరలించారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి స్కూల్‌కూ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, యూనిఫాంలు, గుర్తింపు కార్డులనూ అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పవద్దని కోరారు. ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్‌ల నుంచి రుణాలను తీసుకునే సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.