యాచారం, నవంబర్12: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడ నుంచి తులేకలాన్ (పెత్తుల్ల)వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గత కొంతకాలంగా రోడ్డంతా మట్టి కొట్టుకుపోయి కంకర తేలి గుంతలమయంగా మారింది. ఇటివల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురికావడంతో వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొన్నది. కార్లు, ఆటోలు కాదుకదా కనీసం ద్విచక్రవాహనాలు సైతం వెళ్లలేనంత అధ్వాన్నంగా తయారైంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నిత్యం ఈ లింకు రోడ్డుతో నరకం చవిచూస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నడపాలంటేనే జంకుతున్నారు.
ముఖ్యంగా రాత్రిపూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఇది ఇటు యాచారం మండలం అటూ ఇబ్రహీంపట్నం మండలాలను కలుపుతూ లింకురోడ్డుగా ఉన్నది. ఈ రోడ్డు ప్రయాణికులకు తక్కువ సమయంలో తక్కువ దూరంలో ఎంతో సులభంగా నాగార్జున సాగర్ రోడ్డుతో పాటు ఇబ్రహీంపట్నంను చేరుకోవడానికి ఈ రోడ్డు ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉన్నది. ఈ రోడ్డుగుండా గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నడిచేది. దీంతో విద్యార్థులకు, పూలు, పండ్లు, పాలు, కూరగాయల వ్యపారులకు, ఉద్యోగులకు, రోజువారి కూలీలకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంతో సౌకర్యవంతంగా ఉండేది.
ఇటివల మట్టి రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఆర్టీసీ బస్సును అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు రవాణా కోసం నానా అవస్థలు పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో ఈ రోడ్డు గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడంలో అటు పాలకులు, ఇటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ధర్మన్నగూడ-తులేకలాన్ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలని గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు. లేదంటే రోడ్డుకు మరమ్మతులు చేసేవరకు యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.