బడంగ్‌పేట, నవంబర్ 11 : మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను ఒక విజన్‌తో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్గూడ పోచమ్మకుంట సుందరీకరణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. చెరువు చుట్టూ తిరిగి సుందరీకరణ పనులు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో ఉన్న పూడిక తీయించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు మురికి కూపాలుగా మారుతున్నాయన్నారు.
చెరువుల్లో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే పరిస్థితి లేదని ఆమె మండి పడ్డారు. బాలాపూర్ మండలంలోనే 42 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని చెరువుల్లోకి మురుగు నీరు వస్తున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల కాలనీలవాసులకు దుర్గంధం వస్తుందని.. కాలనీవాసుల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చెరువుల్లోకి మురుగు నీరు పోకుండా ఎస్ఎన్డీపీ నాలాల ద్వారా బయటకు పంపించామన్నారు. పోచమ్మ కుంటకు గత ప్రభుత్వంలోనే రూ.2కోట్లు మంజూరు చేసి సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. త్వరగా పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేశారన్నారు. సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించి సుందరీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 11 చెరువుల్లో సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. గతంలో రూ.40కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. కొన్ని చెరువులను సుందరీకరణ పనులు పూర్తి చేయగా కొన్ని చెరువులు మధ్యలో ఉన్నాయన్నారు. చెరువుల అభివృద్ధి రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చూడాలని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, డీఈ యాదయ్య, ఏఈ వినీల్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి పాల్గొన్నారు.