మణికొండ, అక్టోబర్ 13 : అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్‌పాషా, నార్సింగి మున్సిపల్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీల నుంచి వంద మంది మహిళలు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సబితారెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక, అసమర్థ పాలన కొనసాగుతున్నదని.. ఇలాంటి పాలనకు ప్రజలు స్వస్తి పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎప్పటికీ బీఆర్ఎస్కు కంచుకోటలాంటిదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆమె పేర్కొన్నారు.
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతానని బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి అన్నారు. ముక్తార్‌పాషా నేతృత్వంలో మైనార్టీ మహిళలు, నాయకులు బీఆర్ఎస్లో చేరడాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ముక్తార్‌పాషా తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాలు, గణేశ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గబ్బర్‌సింగ్, సంతోష్, చిరంజీవి, మల్లేశ్, మహిపాల్ పాల్గొన్నారు.