వికారాబాద్, ఆగస్టు 10 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, అధికారులను వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం వనమహోత్సవంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 14, 23వ వార్డుల్లోని పార్కులలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు.
అనంతరం మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, వర్షాలు కురిసేందుకు చెట్లు దోహద పడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. పార్కుల్లో యోగా బెడ్స్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. పార్కులో ఉన్న 23వ వార్డు చిన్నారులతో ఎలాంటి ఆట వస్తువులు కావాలంటూ ముచ్చటించారు. మున్సిపల్ సిబ్బంది, డీఆర్డీఏ, ఆర్పీ లతో మాట్లాడి వారికి ఉన్న సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రామస్వామి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.