ఖైరతాబాద్, జూన్ 18 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రాష్ట్ర సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి నేతలను అరెస్టు చేసి అబిడ్స్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొల్లెపల్లి స్వామిగౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వెంటనే రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడగామని హెచ్చరించారు. బీసీ నేతలు శ్రీనివాస్, శ్యామ్ కురు మ, మణిమంజరి, లింగం గౌడ్, విజయ్ గౌడ్, మల్లికార్జున యాదవ్, వరుణ్ కుమార్, రాజేందర్, మహేశ్, సంపత్ నాయుడు, మధు యాదవ్ పాల్గొన్నారు.