మండలంలోని గున్గల్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫారెస్టు చుట్టూ కంచె లేకపోవడంతో వన్య ప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఒక్కోసారి పదుల సంఖ్యలో జింకలు అటవీ ప్రాంతంలో నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిని దాటుతుంటాయి. ఈ క్రమంలో ఏదో ఒక చోట వాహనాల కింద పడి మృత్యువాతపడుతున్నాయి. తాజాగా బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందిన సంఘటన తెలిసిందే, ఇలా రోడ్డు ప్రమాదాలు తరచూ కొనసాగుతున్నాయి. దీంతోపాటు వీధికుక్కల దాడిలో, వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అడవికి కంచె లేకపోవడంతో దుండగులు అటవీ సంపదను లూటీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఫారెస్టు అధికారులు చోద్యం చూస్తున్నారు.
యాచారం, ఆగస్టు 17 ; హైదరాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో 1674 హెక్టార్లలో 58 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న గున్గల్ అటవీ ప్రాంతంలో అనేక రకాల జంతువులు, పక్షులు జీవిస్తుంటాయి. ముఖ్యంగా జింకలు, దుప్పులు, అడవిపందులు, ఏదులు, ఆల్గాలు, నెమళ్లు, అనేక రకాల పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ రహదారికి ఆనుకొని ఉన్న ఈ అటవీ ప్రాంతం శ్రీశైలం రహదారి మన్ననూరు వరకు విస్తరించి ఉన్నది. గతంలో శ్రీశైలం అడవుల నుంచి వచ్చిన చిరుత మండలంలోని తాటిపర్తి, నందివనపర్తి, కొత్తపల్లి, మేడిపల్లి, కడ్తాల మండలం గోవిందపల్లి, ఎక్వపల్లి, ముద్విన్ అటవీ ప్రాంతాల్లో సంచరించి అనేక ఆవులు, మేకలు, ఆవు దూడలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే, పలుమార్లు సీసీ ఫుటేజీలకు చిక్కిన చిరుత బోనుకు మాత్రం చిక్కలేదు. చివరకు తిరిగి శ్రీశైలం అడవులకే వలస వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకవైపు కొంత మంది దుండగులు గుట్టుచప్పుడు కాకుండా వృక్ష సంపదను దోచుకుంటుంటే మరోపక్క వేటగాళ్లు జంతువులు, పక్షులను వేటాడి హతమారుస్తున్నారు. వేటగాళ్ల దెబ్బకు కొన్ని జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి.
రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న వన్యప్రాణులు
గున్గల్ అడవి చుట్టూ కంచె లేకపోవడంతో సాగర్ రహదారి వెంట అప్పుడప్పుడు వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలు వాటిని ఢీకొట్టడంతో అవి మృత్యువాతపడుతున్నాయి. ఇలా ఇప్పటికే పలుమార్లు జింకలు, అడవిపందులు రోడ్డు ప్రమాదాలకు బలైపోయాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ జేసీబీతో కందకం తీసి వదిలేస్తున్నారు. అంతే మళ్లీ కథ మొదటికొస్తున్నది. ఇలా కాకుండా అటవీ ప్రాంతం చుట్టూ బలమైన కంచె వేస్తే జంతువులు ఫారెస్టు దాటి రోడ్డుపైకి రాకుండా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.
వీధికుక్కల దాడిలో..
కొన్ని వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురైతే మరికొన్ని వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నాయి. కొంత మంది వ్యాపారులు కోళ్ల వ్యర్థాలు, చనిపోయిన కోళ్లు, పశువుల కళేబరాలు, మేక తోళ్లు, ఇతరత్రా వ్యర్థాలు రాత్రిపూట ఫారెస్టు సమీపంలో సాగర్ రహదారి పక్కనే యథేచ్ఛగా పడేయడంతో వాటి కోసం వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అప్పుడప్పుడు జింకలను వెంటాడి చంపేసిన ఘటనలున్నాయి. ఇటీవలే అడవి నుంచి నందివనపర్తి వ్యవసాయ పొలం వద్దకు వచ్చిన ఓ జింకను వీధి కుక్కలు గాయపర్చగా గ్రామస్తులు దానికి ప్రథమ చికిత్స చేసి ఫారెస్టు అధికారులకు అందించారు. గాయాలతో జనావాసాలకు వచ్చిన నెమళ్లకు సైతం చికిత్స చేసి స్థానికులు పోలీసులకు అప్పగించిన సంఘటనలు అనేకం.
వేటగాళ్ల వలలో చిక్కుకొని..
గున్గల్, తాటిపర్తి, తులేకలాన్, చరికొండ, మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, మంథన్గౌరెల్లి, మేడిపల్లి తదితర గ్రామాల్లో ఉన్న గుట్టల ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటకుక్కలు, ఉచ్చులు, వలలు, వేట కత్తుల సాయంతో కంజులు, బురకలు, పావురాలు, గోరెంక పిట్టలు, పిచ్చుకలతోపాటు ఉడుములు, ఏదులు, ఆల్గలు, అడవి పందులు, అడవి పిల్లులు, కుందేళ్లు, అక్కడక్కడ జింకలను సైతం వేటాడుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. వాటిని మాంసంగా చేసి ఇతరులకు విక్రయించి జోరుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వేటగాళ్ల దెబ్బకు కొన్ని రకాల పక్షులు, జంతువులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఫారెస్టు అధికారులు తగిన చర్యలు చేపట్టి వన్యప్రాణులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
వన్యప్రాణులను సంరక్షించాలి
వన్యప్రాణులు, వృక్ష సంపదను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. గున్గల్ అటవీ ప్రాంతం నుంచి జింకలు, అడవిపందులు బయటకు రాకుండా తగిన చర్యలు చేపట్టాలి. అటవీ ప్రాంతం చుట్టూ కందకం కాకుండా దట్టమైన కంచెను ఏర్పాటు చేయాలి. బోర్లు వేయించి, సోలార్ మోటర్లు బిగించాలి. గున్గల్ ఫారెస్టులో అధిక సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు, నెమళ్లను కాపాడాలి. జంతువులు, పక్షులను బలిగొంటున్న దుండగులపై ఫారెస్టు అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణులు అంతరించి పోకుండా ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి.
– జర్పుల విజయ్నాయక్,అడ్వకేట్, తక్కళ్లపల్లితండా, యాచారం మండలం
జంతువులను వేటాడితే చర్యలు తప్పవు
పక్షులు, జంతువులను వేటాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అటవీ జంతువులను వేటాడినా, మాంసం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పెట్రో మోబైల్ ద్వారా సంతలు, మార్కెట్లలో దాడులు నిర్వహిస్తాం. ఎవరైనా నేరానికి పాల్పడితే సహించేదిలేదు. మీ పరిసరాల్లో ఎక్కడైనా జంతువులు, పక్షులను వేటాడినా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. అటవీ జంతువుల పరిరక్షణ అందరి బాధ్యత.
– నందీశ్వర్రెడ్డి, సీఐ, యాచారం