తాండూరు, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన 13మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన తాండూరును కదిలించింది. తాండూరు పట్టణం వడ్డెర గల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఇటీవలె పెద్ద కూతురు వివాహం జరిగింది. ముగ్గురు కూతుళ్లు హైదరాబాద్‌లో చదువుతున్నారు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది.
మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, నాలుగో కూతురు అదే కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నది. తన అక్క పెండ్లి కోసం తాండూరుకు వచ్చిన ముగ్గురు చెల్లెళ్లు సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా బస్సు ప్రమాదంలో మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదే విధంగా తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన స్టోన్ వ్యాపారి చాంద్‌పాష గౌతాపూర్‌లో నివాసముంటున్నారు. కూతురు ముస్కాన్ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా.. ఆదివారం ఇంటికి వచ్చి సోమవారం తిరిగి కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతి చెందింది.
అనాథలైన బాలికలు
యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కుటుగుంట బందెప్ప-లక్ష్మి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భార్య లక్ష్మికి గతకొంత కాలంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో భర్త బందెప్ప హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో వారి పిల్లలు శిరీష(16), భవానీ(9)అనాథలుగా మారారు. పేదరికం ఒకవైపు వారిని వేధిస్తుంటే.. మరో వైపు బస్సు ప్రమాదం తల్లిదండ్రులను బలిగొనడంతో ఆ ఇద్దరు పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఇద్దరు పిల్లలను ప్రభుత్వం బాధ్యత తీసుకొని చూసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఉన్నత చదువులకు వెళ్తూ..
యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, అలివేలు దంపతుల కూతురు అఖిలరెడ్డి(20) హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్నది. సెలవుల్లో సొంతూరులో కుటుంబసభ్యులతో గడిపి తిరిగి కళాశాలకు వెళ్తున్నండగా ఈ రోడ్డు ప్రమాదంతో మృతి చెందింది.
కాన్పుకు వచ్చి వెళ్తుండగా..
తాండూరు పట్టణం ఇంద్రా నగర్‌కు చెందిన ఖాలీద్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు సలేహ(20)కు హైదరాబాద్‌కు చెందిన వాహిద్‌తో వివాహం కాగా, కాన్పుకు తాండూరుకు వచ్చి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఖాలీద్ తన కూతురు సలేహతోపాటు మనుమరాలు(2 నెలల)ను అత్తవారింటికి పంపేందుకు బస్సుల్లో ఎక్కారు. బస్సు చేవెళ్ల సమీపంలో ప్రమాదానికి గురికావడంతో పసి పాపతోపాటు తల్లి కూడా మృతి చెందారు. చికిత్స పొందుతూ ఖాలీద్ కూడా మృతిచెందాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. అదే విధంగా కంకరలో పూడుకుపోయిన తబస్సుమ్ మృతి చెందగా.. భర్త, ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారు.
స్పాట్లో మృతి చెందిన డ్రైవర్
బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబా(45) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సుకు పదిరోజుల కిందటే డ్రైవర్‌గా చేరినట్లు తెలిసింది. ప్రతిరోజు ఇదే బస్సు తాండూరు-హైదరాబాద్‌కు మొదటి సర్వీసుగా వెళ్తుండేది. డ్రైవర్ దస్తగిరిబాబ గతంలో అనంతగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను కాపాడినట్లు తెలిసింది. నేడు ఆయనతోపాటు అనేక మంది మృతి చెందడంతో బాధితులు బోరుమంటున్నారు. మరోవైపు మహిళా కండక్టర్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ఛీప్విఫ్ మహేందర్‌రెడ్డి, ఎమ్యెల్యేలు సబితారెడ్డి, కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి క్షతగాత్రులను పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.