బండ్లగూడ, జూన్ 17 : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు మాన్సూన్ సిబ్బందికి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు. మంగళవారం వర్షాకాలం నేపథ్యంలో రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీస్, ఇంజినీరింగ్ విభాగం, పారిశుద్ధ విభాగం, హైడ్రా సిబ్బంది తదితర సిబ్బందితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే గ్రూపులో ఫొటోలు పంపుతూ అందరూ కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి హైడ్రా సహాయంతో వాటిని కూల్చి వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.