షాబాద్, ఫిబ్రవరి 5 ; ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకూ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలో బుధవారం గరిష్ఠంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగ మండుతుండడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. నిన్న, మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా.. ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే శీతలపానీయాలను ఆశ్రయిస్తుండగా, అటు ఉక్కపోత నుంచి విముక్తి పొందేందుకు కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు అత్యధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రతలు 28-33 డిగ్రీలకు వరకు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి..
మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యే సరికి ఎండ తీవ్రత పెరుగుతున్నది. పెండ్లిళ్ల సీజన్ ఉండడంతో ప్రజలు తలకు టవల్, కర్చీఫ్, టోపీలు, గొడుగులు ధరించి కనపడుతున్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడే ఎండల తీవ్రత ఇంత స్థాయిలో ఉంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి బోండాలు, నిమ్మకాయ పాయాలు, లస్సీలు, పండ్ల రసాలకు గిరాకీ
మార్చి, ఏప్రిల్, మే లో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పాటు రోహిణి కార్తె ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న వాతావరణం వేరు, రానున్న కాలంలో పరిస్థితులు వేరుగా ఉండనున్నాయి. రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకనుంచి మధ్యాహ్నం పూట బయటకి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకువెళ్లాలని చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. మరో మూడు నెలలు ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉన్నదని, వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వైద్యనిపుణులు సూచిస్తున్నారు.