కడ్తాల్, ఆగస్టు 14 : వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఆధారపడి మండలంలో ఎంతో మంది పాడి రైతులు జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయంలో వచ్చే రాబడిపై నమ్మకం లేక రైతులు పాడిని నమ్ముకొని పశుపోషణను అభివృద్ధి చేసుకున్నారు. పాల ఉత్పత్తిలో కడ్తాల్ మండలం రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నది. ప్రతి రోజూ పాల శీతలీకరణ కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి పాలను తరలిస్తారు. విజయ పాల సేకరణ కేంద్రాల్లో పాలు పోసే రైతులకు 15 రోజులకోసారి బిల్లులు చెల్లించడం జరుగుతున్నది. కానీ రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి బిల్లులు రాకపోవడంతో రైతులు ఆగమైపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాల బిల్లులు సక్రమంగా రావడంలేదని రైతులు వాపోతున్నారు. పదిహేను రోజులకోసారి చెల్లించాల్సిన పాల బిల్లులను, రెండు నెలలకు ఒకే బిల్లు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని మండల కేంద్రంలో పాడి రైతులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి.
నాలుగు వేల మంది రైతులకు బిల్లులు రావాలి
మండలంలో పాడిని నమ్ముకొని వేల మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. పాలశీతలీకరణ కేంద్రానికి చల్లంపల్లి, మాడ్గుల, చంద్రధన, మన్యగూడ, జైత్వారం గ్రామాల్లోని రైతుల నుంచి సేకరించిన పాలను తరలిస్తారు. పాల శీతలీకరణ కేంద్రానికి ప్రతి రోజూ 63 వేల లీటర్ల పాలు వస్తాయి. దాదాపు నాలుగు వేల మంది పాడి రైతులకు చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటివరకు రూ.14 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పాల బిల్లులు సక్రమంగా రాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో పశుపోషణ భారమవుతున్నదని రైతులు లబోదిబోమంటున్నారు. పశువులకు దాణా, మందులకు, పశుగ్రాసానికి అప్పులు చేస్తున్నామని, పిల్లల చదువులకు ఫీజులు సైతం కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండడంలేదని రైతులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా విజయ డెయిరీ ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పాడి రైతుల బాధలు వర్ణనాతీతం..
విజయ డెయిరీలో పాలు పోసే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నేను ప్రతి రోజూ గ్రామంలోని విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో పాలు పోస్తాను. నాకు రెండు నెలల పాల బిల్లు రూ.1.40 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం పాల బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. 60 రోజులుగా బిల్లులు రాకపోవడంతో పశుపోషణ భారంగా మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడం ప్రభుత్వానికి తగదు.
– బాచిరెడ్డి రవీందర్రెడ్డి, పాడి రైతు, కడ్తాల్ మండలం
పాల బిల్లులు వెంటనే చెల్లించాలి
నిత్యం విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో పాలు పోస్తాను. నాకు రెండు నెలల రూ.1.50 లక్షల బిల్లు పెండింగ్లో ఉన్నది. సమయానికి బిల్లులు రాకపోవడంతో దాణా, గడ్డికి అప్పులు చేస్తున్నా. డబ్బులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం పాడి రైతులను చిన్న చూపు చూస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో పాల బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాడి రైతుల బాధలు పెరిగాయి.
– ఎగిరిశెట్టి దశరథం, పాడి రైతు, కడ్తాల్ మండలం