సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా 4శాతం లాభాలు చెల్లిస్తామంటూ కొందరిని, డబుల్ గోల్డ్ స్కీమ్ కింద పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తామంటూ 3600మంది నుంచి సుమారు రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన 8మంది ఘరానా మోసగాళ్లను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం…కలిదిండి పవన్‌కుమార్ 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి రావుల సత్యనారాయణ, హరికృష్ణ, వల్లూరు భాస్కర్‌రెడ్డి, పగడాల రవికుమార్‌రెడ్డి, కొల్లటి జ్యోతి, కురల్ల మౌనిక, కుర్కుల లావణ్య అనుచరులుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా తమ కంపెనీలో కనీసం రెండు గుంటల స్థలాన్ని రూ.8.08లక్షల పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేస్తే వారికి 25 నెలల పాటు ప్రతి నెలా 4శాతం చొప్పున రూ.32వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతే కాకుండా ఈ స్కీమ్‌లో చేర్పించిన వారికి 1శాతం చొప్పున 25నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని నమ్మించారు. అదే విధంగా డబుల్ గోల్డ్ స్కీమ్‌లో కనీసం రూ.4లక్షలు పెట్టుబడిగా పెడితే వారికి బాండ్ ఇవ్వడంతో పాటు 12నెలల తరువాత పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అంటే రూ.8లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్స్‌ను అందజేస్తామని నమ్మించారు.
గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేసి రూ.5లక్షలను 20నెలల పాటు పెట్టుబడిగా పెడితే పెట్టిన పెట్టుబడిపై 19నెలల పాటు 3శాతం అంటే రూ.15వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని, 20వ నెల మరో రూ.15వేలు అదనంగా చెల్లిస్తామని ఈ క్రమంలో మొత్తం రూ.8లక్షలు చెల్లిస్తామని నమ్మించారు. ఈ విధంగా మొత్తం 3600 మంది నుంచి సుమారు రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన నాయని హరికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు జరిపి 12వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రై.లి.ఎండీ కలిదిండి పవన్‌కుమార్ సహా మొత్తం 8మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.