ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా పండ్ల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఉద్యాన పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు వందశాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పలు పథకాల కింద నిధులను మంజూరు చేస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో 2,055 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 1571 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయడమే లక్ష్యంగా ఉద్యాన శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ నెలాఖరులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకూ సబ్సిడీ ఇవ్వనున్నారు. నాలుగేండ్ల వరకు మొక్కల సంరక్షణ, తోటల నిర్వహణకూ ప్రభుత్వమే నిధులను అందజేయనున్నది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోట, జీడిపప్పు, మునగ, డ్రాగన్‌ఫ్రూట్, ఆపిల్‌బేర్ తదితర పంటలకు సబ్సిడీ వర్తింపజేస్తున్నది.
రంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పండ్ల తోటలు సాగవ్వడం లేదు. సరైన ఉత్పత్తి లేక ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై పథకాల కింద నిధులను మంజూరు చేస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో 2055 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలాఖరులోపు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందజేయనున్నారు. నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మొక్కలతోపాటు నిర్వహణకూ నిధులను అందజేస్తున్నది.
తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై పథకంలో ఉద్యాన పంటల సాగుకు పెద్దపీట వేస్తున్నారు. పెట్టుబడి వ్యయం ఎక్కువ కావడంతో సన్న, చిన్నకారు రైతులు తోటల సాగు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే 13 రకాల పండ్ల తోటల సాగుకు ఆర్థిక సాయం అందించేందుకు సంకల్పించి ప్రోత్సాహం కల్పిస్తున్నది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, సపోట, జీడిపప్పు, మునగ, డ్రాగన్‌ఫ్రూట్, అల్లనేరేడు, ఆపిల్‌బేర్, దానిమ్మ, కొబ్బరి రకాల పంటలను సాగుకు సాయమందించాలని నిర్ణయించింది.
నాలుగేండ్ల వరకు బాధ్యత ప్రభుత్వానిదే..
పండ్ల తోటల సంరక్షణ బాధ్యతను నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే వహిస్తుంది. మామిడి రూ.30, బత్తాయి 44, నిమ్మ 25, సపోట 37, జీడిపప్పు 24, సీతాఫలం 26, ఆపిల్‌బేర్ 51, దానిమ్మ 24, కొబ్బరి 26, జామ 31, మునగ 15, అల్లనేరేడు 25 చొప్పున ఒక్కో మొక్కకు చెల్లించనున్నారు. ఎరువులకు ఒక్కో మొక్కకు రూ.50, నిర్వహణ ఖర్చు కింద రూ.10 చొప్పున చెల్లించడంతోపాటు ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వడం, మొక్కలు నాటే పనులు చేపడతారు. మొక్కలు నాటిన ఏడాది నుంచి మొత్తం నాలుగేండ్ల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు మొక్కలను ప్రభుత్వ నర్సరీల ద్వారా కానీ రిజిస్టర్డ్ ప్రైవేట్ నర్సరీల ద్వారాగాని కొనుగోలు చేసుకోవచ్చును.
రాయితీపై బిందు సేద్యం పరికరాలు
పండ్ల తోటల సాగుకు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగి ఉండి, 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులు. సాగునీటి వసతి కలిగి ఉండాలి. గతేడాదికి భిన్నంగా ఈసారి బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగిలిన సామాజిక వర్గాల రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలను అందజేస్తారు.
నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు
జిల్లాలో 2,055 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని అధిగమించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల గుర్తింపు, ఆగస్టు 15లోగా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి మొక్కలు నాటడం, బిందు సేద్యం పరికరాల బిగింపు పనులను పూర్తి చేయనున్నారు. పండ్ల తోటల పెంపకం ఆధారంగా ఒక్కో ఎకరానికి రూ.లక్ష నుంచి 3లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
లక్ష్యాన్ని అధిగమిస్తాం : ప్రభాకర్, డీఆర్డీవో
రైతులు లాభదాయక పండ్ల తోటల సాగును చేపట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నది. ఈ క్రమంలోనే మొక్కల కొనుగోలు నుంచి నాటడంతోపాటు నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. జాబ్ కార్డు కలిగిన సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నాం.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి
– సునందారెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి
పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు ఈ నెలాఖరు లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీ సెక్రటరీ, ఉపాధి హామీ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారి, ఉద్యాన అధికారులు, ఎంపీడీవోలను సంప్రదిస్తే సమగ్ర వివరాలను అందిస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగపర్చుకోవాలి.